NTV Telugu Site icon

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ 8 గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల తాకిడి

Srisailam Dam

Srisailam Dam

ఓవైపు గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో పాటు.. మరోవైపు.. కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది.. శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది.. దీంతో 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో 2,04,895 క్యూసెక్కుల నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండగా.. 8 గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా ఔట్ ఫ్లోగా 2,85,724 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.60 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Read Also: Manushi Chhillar: చిరిగిన డ్రెస్ లో విశ్వసుందరి సెగలు పుట్టిస్తుందే..

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుల చేస్తుండటంతో శ్రీశైలానికి భారీగా ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం నిండుకుండలా మారడంతో పర్యాటకులు కూడా భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా.. శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు పర్యాటకులు వస్తుంటారు.. శ్రీశైలం గేట్లు ఎత్తినప్పుడు.. ఆ అందాలను చూసేందుకు తరలివస్తుంటారు. అటు శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులు శ్రీశైలం జలాశయం చూడడానికి వస్తున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి విడుదలవుతున్న నీటి పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇక, నాగార్జునసాగర్‌లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది.