Site icon NTV Telugu

ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలన: ఏపీ గవర్నర్

ఏపీ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రభుత్వం తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్‌రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: ఏపీలో కొత్త లెక్కలు… ఇకపై జనాభాలో కర్నూలు జిల్లానే టాప్

జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. పేద విద్యార్థులకు బాసటగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని.. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని గవర్నర్ ప్రసంగించారు.

అటు కొత్త జిల్లాలపైనా గవర్నర్ హరిచందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని.. ఇందులో గిరిజనుల కోసం రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని.. అప్పటి నుంచి కొత్త జిల్లాలలో పరిపాలన ప్రారంభమవుతుందన్నారు. మరోవైపు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 23 శాతం పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందన్నారు.

Exit mobile version