NTV Telugu Site icon

Andhra Pradesh: గుడ్‌న్యూస్.. 7,218 వాలంటీర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. తాజా పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో మండల, పట్టణ యూనిట్‌గా వాలంటీర్లను నియమించగా.. ఇప్పుడు గ్రామాల్లో 4,213, పట్టణాల్లో 3,005 వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో వాలంటీర్ పోస్టుల భర్తీకి నెలలో రెండుసార్లు జాయింట్ కలెక్టర్లు నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నారు. ఖాళీల వివరాలను ప్రతినెల 1, 16వ తేదీల్లో ఎంపీడీవోలు, పురపాలక శాఖ కమిషనర్‌లు కలెక్టర్లకు సమర్పించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వాలంటీర్లను తొలగిస్తారు. ఏడో రోజున వాలంటీర్ స్థానం ఖాళీ అయినట్లు అధికారులు నోటిఫై చేసి జాయింట్ కలెక్టర్‌కు నివేదిక అందించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.