NTV Telugu Site icon

New Police Posts: పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌..!

Ap Police

Ap Police

పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీరు సిద్ధం కావాల్సిన సమయం రానేవచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలోనే పెద్ద సంఖ్యలో పోలీసు కొలువులు భర్తీ చేయనుంది.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ప్రతీ ఏడాది 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. సీఎం ఆదేశాలను అనుగుణంగా.. త్వరలోనే నోటిఫికేషన్‌ రాబోతోంది.. మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ ఖరారు చేశారు.. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు..

Read Also: Astrology : నవంబర్‌ 26, శనివారం దినఫలాలు

ఇక, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు.. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోస్టింగ్‌ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఎస్సై (సివిల్)- 387, ఎస్సై (ఏపీఎస్పీ) – 96, పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)- 3,508, ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ఏఆర్ బెటాలియన్)- 2,520 భర్తీ చేయబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణలోను పోలీసు ఉద్యోగాల భర్తీకి పూనుకుంది ప్రభుత్వం.. ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడడం.. రాత పరీక్షలు కూడా పూర్తి చేసి.. ఫలితాలు విడుదల చేశారు.. ఇక, డిసెంబర్‌లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైన విషయం విదితమే.. ఈ సారీ తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో యువత పోటీపడుతున్నారు.