కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను మరో వారం రోజులు పొడిగించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కూడా మరో 24 గంటల పాటు పొడిగించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ చెలరేగిన అమలాపురం అల్లర్లలో ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని ఆయన స్పష్టం చేశారు.
కాగా అమలాపురం అల్లర్లకు కీలక సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్యం సాయి పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఈ నెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనలో అన్యం సాయి కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. అల్లర్లు జరిగిన సమయంలో రికార్డైన వీడియోలు, సీసీటీవీ పుటేజ్, టవర్ లొకేషన్ లాంటి సాంకేతికత ఉపయోగించి నిందితులను గుర్తిస్తున్నామని, అందులో భాగంగా మరో 25 మందిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.