NTV Telugu Site icon

3 Capitals Boost to YSRCP: వైసీపీకి కలిసొచ్చిన మూడు రాజధానులు..! ఎన్నికల నినాదం అదే..

3 Capitals

3 Capitals

అమరావతి అనేది ఓ మాయ.. అదో భ్రమ.. అమరావతి అంటే అంతులేని అవినీతి.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే వికేంద్రీకరణ.. మూడు రాజధానులు ముద్దు అంటున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు వ్యతిరేకించారని, మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని.. అలాంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడకూడదని ప్రజలు తీర్పు ఇచ్చారని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు, కులాలు, వారి ఆశలు, ఆంకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని, ఆవిష్కరించిందని.. కాబట్టే తమ ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారు.. ఏ ఎన్నికలు వచ్చినా బ్రహ్మరథం పడుతున్నారని.. ఏదేమైనా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు.. ఇంతలా వైఎస్‌ జగన్‌ ఫిక్స్‌ అవ్వడానికి అసలు కారణం ఏంటి? అంటే.. ఆ నినాదం వైసీపీకి బాగా బూస్ట్‌ ఇచ్చిందట.. అది ఎంతలా అంటే.. వచ్చే ఎన్నికల్లో.. ఆ పార్టీ అదే నినాదంతో ఎన్నికలకు వెళ్లనుందట.. దానికోసం ఇప్పటికే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసే పనిలో పడిపోయారు ఆ పార్టీ నేతలు.

Read Also: Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలడా?

గతంలో పాదయాత్రలతో ప్రజల్లోనే గడిపిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మేం అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలు అమలు చేస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేసి అధికార పీఠాన్ని అధిరోహించారు.. అయితే, ఇప్పుడు.. ఇప్పటికే అమలు చేసేన పథకాలతో పాటు.. మూడు రాజధానుల నినాదంతో 2024లో తిరిగి పవర్‌లోకి రావాలన్నది జగన్‌ ప్లాన్‌గా ఉందట.. సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు అని ఎన్నికల బరిలోకి దిగితే.. వాళ్ల టార్గెట్‌ 175కి 175 సాధ్యం కాదన్న భావనతో.. ‘మూడు రాజధానులు’ అనే సెంటిమెంట్‌ను వాడుకోవాలని భావిస్తున్నారట.. మూడు రాజధానుల సెంటిమెంట్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లోలాగా కాకుండా.. ఈ సారి విపక్షాలు అన్నీ ఏకమయ్యే అవకాశం ఉన్నందున.. ఉమ్మడిగా వచ్చినా విపక్షాలను కట్టడి చేయాలంటే ఇదే సరైన నినాదమని భావిస్తున్నారు.. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు అమరావతి రాజధాని అనే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అదే సమయంలో మూడు రాజధానులు అంటే తమ ప్రాంతంలో ఏదో ఒక రాజధాని వస్తుందనే ఆశతో ఉన్నారట.. దీనిపై అమరావతి ప్రాంతంలో కొంత వ్యతిరేకత ఉన్నా.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో మాత్రం.. ఇది అధికార పార్టీకి బాగా కలిసివచ్చే అంశంగా ఉంది.

Read Also: FIFA World Cup2022 : ఖతార్‎ను కలవరపెడుతోన్న ‘కేమెల్ ఫ్లూ’.. ఆందోళనలో ఫుట్ బాల్ లవర్స్

ఇదే సమయంలో.. మేం, అమరావతిని రాజధానిగా తీసివేయడం లేదు.. కేవలం పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా… ఇతర సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు.. మంత్రులు కూడా స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. అంటే.. అమరావతి రాజధానిని కోరుకునే వారికి కూడా మరింత చేరువ అవుతున్నారన్నమాట.. అంటే.. విశాఖలో పరిపాలనా రాజధానితో ఉత్తరాంధ్ర ప్రజల మనస్సు గెలుచుకుని.. కర్నూలులో న్యాయ రాజధానితో రాయలసీమ ప్రజల మన్ననలను అందుకుని.. అమరావతిలో శాసనరాజధానితో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రజల మద్దతు కూడగడుతున్నారు.. ఇలా మొత్తంగా మూడు రాజధానుల వ్యవహారం.. వైసీపీకి మంచి బూస్ట్‌ ఇస్తుంది.

ఇక, విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర జేఏసీ తలపెట్టిన విశాఖ గర్జన సభకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించిన అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఆ సభ బాధ్యతను మొత్తం తన భుజాలపై వేసుకునొ విజయవంతం చేసింది.. రాష్ట్ర మంత్రులతో పాటు, వైసీపీ నేతలు ఈ సభలో పాల్గొన్నారు. కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా.. రాయలసీమలోనూ వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో తిరుపతి వేదికగా.. ర్యాలీ, సభ నిర్వహించారు.. సీమలోని మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తమ ప్రాంతంలో ఓ రాజధాని ఏర్పాటు కావాల్సిందే అని గొంతెత్తి చాటుతున్నారు.. హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనం అయినప్పుడే.. తాము రాజధానిని త్యాగం చేశాం.. ఇప్పుడైనా మాకు రాజధాని ఇవ్వరా? అని నిలదీస్తున్నారు.. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కర్నూలులో పర్యటించినప్పుడు.. ఆయనకు నిరసన సెగ తప్పలేదు.. ఉత్తరాంధ్రలోనూ ఇలాంటి సీన్లే రిపీట్‌ కాబోతున్నాయట..

ఇప్పటికే 2024 ఎన్నికలు మూడు రాజధానులు వర్సెస్ అమరావతిగా ఉండబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పకనే చెప్పారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట.. గత ఎన్నికలో నవరత్నాలు వైసీపీకి అధికారాన్ని తెచ్చిపెడితే.. అప్పుడు ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం పూర్తి చేశామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను కూడా తీసుకువస్తున్నారు.. దీనికి తోడు మూడు రాజధానుల వ్యవహారం అధికార పార్టీకి అన్ని విధాలుగా కలిసిరాబోతోంది. అమరావతి ఎలాగో లెజిస్లేటీవ్ క్యాపిటల్‌గా కొనసాగుతుంది. పరిపాలనా రాజధాని వైజాగ్‌ను మార్చడం ద్వారా ఉత్తరాంధ్రకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఇక ఎప్పటి నుంచో రాయలసీమకు హైకోర్టు కేటాయించాలనే డిమాండ్ ఉండనే ఉంది.. అందుకే.. వైసీపీ అధినేత మూడు రాజధానులు ఫిక్స్‌ అయిపోయారు.. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఇప్పటికే వ్యూహాలకు పదును పెడుతున్నారు.. ఈ ఎన్నికల్లో గెలిస్తే.. మరో 25 ఏళ్లు మనదే అధికారం అంటున్నారు.. అంటే.. అదంతా మూడు రాజధానుల మహిమే నట.. మరో 15 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ సమయంలో పరిపాలనా వికేంద్రీకరణపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. రాబోయే ఎన్నికల మెయిన్ అజెండాగా ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారట.. వైసీపీ సెంటిమెంట్‌ రాజకీయంతో.. ఏమీచేయలో తెలియని పరిస్థితుల్లో విపక్షాలు పడిపోయాయి అంటున్నారు విశ్లేషకులు..