ఉభయగోదావరి జిల్లాలలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కూనవరం బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై నుంచి గోదావరి పరుగులు తీస్తోంది. ఇప్పటికే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయగా.. ప్రజలు కాలినడకన బ్రిడ్జి దాటుతున్నారు. అటు గోదావరి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. 24 గంటల పాటు గోదావరి ప్రవాహం.. వరద ముంపును మానిటర్ చేస్తోంది. ఇప్పటి వరకు గోదావరి వరద బారిన పడ్డ ఆరు జిల్లాల పరిధిలో 1,79,668 మంది వరద బాధితులు ఉన్నట్లు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.
Read Also: Hyderabad: గజగజ వణికిన హైదరాబాద్. గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి
ఆరు జిల్లాల పరిధిలోని 42 మండలాలు, 280 గ్రామాల ఉండగా గోదావరి వరద ఉధృతికి 175 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. అటు భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టగా.. కూనవరం, పోలవరం, ధవళేశ్వరం వద్ద మాత్రం వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద క్రమంగా పెరగవచ్చని.. 28 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల మేర వరద ధవళేశ్వరానికి చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలీఫ్ క్యాంపుల్లో అందుతోన్న సేవలను స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మానిటర్ చేస్తోంది. ఆరు జిల్లాల పరిధిలో 156 రిలీఫ్ క్యాంపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు 70 వేల మందిని రిలీఫ్ క్యాంపులకు ప్రభుత్వం తరలించింది.
