Site icon NTV Telugu

AP SSC Exams: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు.. టెన్షన్‌ పెడుతోన్న ఆ నిబంధన

Ssc Exams

Ssc Exams

AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. ఈ ఏడాది 6,64,152 మంది విద్యా­ర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్‌ అభ్యర్థుల సంఖ్య 6,09,070గా ఉంది.. మిగతావారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప.. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

Read Also: 10th Exams : నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు

మరోవైపు.. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు అధికారులు… అన్ని కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఫర్నీచర్, మంచి నీరు వంటి సదుపా­యాలు కల్పించామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష సమయా­లకు అనుగుణంగా విద్యార్థుల రాకపోకలకు సమస్య లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తగి­నన్ని బస్సులు నడుపుతోందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో టెన్త్‌ విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం కల్పించింది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ మాధ్యమాల్లో రోజు విడిచి రోజు ఆరు పేపర్లలో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. గత అనుభవాల దృష్ట్యా పేపర్‌ లీక్‌ అనేది లేకుండా పక్కాగా నిఘా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన, లీక్‌ జరిగితే అది ఎక్కడ జరిగిందో వెంటనే కనిపెట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు అధికారులు..

పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ విధించారు పోలీసులు.. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లుకు అనుమతి లేదు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సమయానికి ఉదయం, మధ్యాహ్నం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.. పరీక్ష కేంద్రాలకు విద్యుత్ నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంలను, 108 వాహనం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేశారు.. పరీక్ష జరిగే రోజుల్లో పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. ఈ సారి నిమిషం ఆలస్యం అయినా ఎగ్జామ్‌ సెంటర్‌లోకి విద్యార్థులను అనుమతించరు.. ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేసిన అధికారులు. మరోవైపు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. విద్యార్థులు హాల్‌ టికెట్లు చూపించి ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.

Exit mobile version