Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం గ్రామంలో దారుణం జరిగింది. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తీసి మరో ప్రాంతంలో పూడ్చి పెట్టడం కలకలం రేపుతుంది. అయితే, గ్రామంలో దళితులకు శ్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళితులకు శ్మశానవాటిక లేకపోవడంతో రోడ్డు పక్కన మృతదేహాన్ని గ్రామస్థులు పూడ్చి పెట్టారు. మృతదేహం పూడ్చిన స్థలం రైతు ఆధీనంలో ఉండటంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రాత్రికి రాత్రి మృతదేహాన్ని వెలికి తీసి అయిదు అడుగుల దూరంలో పూడ్చిపెట్టారు.
Read Also: Jagga Reddy: చంద్రబాబు, జగన్, పవన్కు మోడీతో మంచి స్నేహం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగట్లేదు..
ఇక, తమకు శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తే ఈ పరిస్థితి ఉండదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2 ఎకరాల 61సెంట్లలో ఉన్న శ్మశానవాటికకు కేటాయించారు. ఇందులో 2 ఎకరాలు అన్యాక్రాంతం కాగా 61 సెట్ల స్థలమే మిగిలింది. అదీ కూడా 60 సెంట్లు చెరువుగా రెవెన్యూ రికార్డులో నమోదు అయింది. ఉన్న ఒక్క సెంటు స్థలంలో సమాధుల నిర్మాణం సరిపోవడం లేదని దళితులు తీవ్రంగా మండిపడుతున్నారు. భవిష్యత్తులో మృతదేహాలని పుడ్చి వేసేందుకు స్థలం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.
