Girl Traced With Free WiFi: అలిగి ఇంటినుంచి వెళ్లిపోయిన అమ్మాయిని ఫ్రీ వైఫై పట్టించింది.. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి నుంచి అలిగి వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. చదువుపై తల్లి మందలించడంతో ఆవేశంలో పరీక్ష ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన హారిక.. ఆ తర్వాత అదృశ్యమైంది. అయితే, తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు పోలీసులు, 12 రోజుల పాటు ఆమె ఆచూకీ కోసం వెతికారు.
తాను ఉన్న లొకేష్ దొరకకూడదని భావించి హారిక తన మొబైల్‌లో ఉన్న సిమ్ కార్డ్‌ను తీసేసి, ఎలాంటి కాల్ ట్రేసింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయినా ఆమె ప్రయాణం మాత్రం ఆగలేదు. బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో తిరుగుతూ, కేవలం రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఫ్రీ వైఫై ఆధారంగా ఇన్‌టర్నెట్ వాడుతూ ముందుకు సాగింది.. అయితే, ఫ్రీ వైఫై లాగిన్‌తో కేసు ఛేదించారు పోలీసులు.. సిమ్ లేకపోయినా, పబ్లిక్ వైఫై లాగిన్ డేటాతో ఆమె లొకేషన్ ట్రేస్ చేయగలిగింది పోలీసుల టెక్నికల్ టీమ్. ఒక్కొక లొకేషన్‌ను వెరిఫై చేయడం ద్వారా హారిక ప్రయాణ మార్గాన్ని అంచనా వేసి.. చివరకు ఆమెను రాజమండ్రి పరిసరాల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇక, హారిక ఆచూకీ కనుగొన్న తర్వాత, ఆమె ఇంటికి రానంటూ మొండికేసింది.. దీంతో, పోలీసులు కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి, ఆమెను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన టెక్నికల్ టీమ్‌ను ఎస్పీ అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లలతో మాట్లాడి, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని పోలీసులు సూచించారు.
