NTV Telugu Site icon

IPL 2022: రోహిత్ పని అయిపోయినట్లేనా..? ముంబై పరాజయాలకు కారణమేంటి?

Rohit Sharma

Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ మాదిరిగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. ఈ సీజన్‌లో ముంబై టీమ్ వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకుంది.  దీంతో రోహిత్ కెప్టెన్సీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఐపీఎల్ విజయాల కారణంగానే అతడికి టీమిండియా కెప్టెన్సీ అవకాశం వచ్చిందనేది అక్షర సత్యం. మరి ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో రానున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ టీమిండియాను ఎలా నడిపిస్తాడనే విషయంపైనే తెగ చర్చ జరుగుతోంది.

అయితే ప్రస్తుత ఓటములకు వేలంలో ముంబై జట్టు చేసిన తప్పిదమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముంబై పరాజయాలకు కారణం ఆ జట్టు బౌలింగేనని.. గతంలో బుమ్రాకు తోడుగా బౌల్ట్ ఉండేవాడు అని.. వారిద్దరికీ అండగా ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో సహాయం అందించేవాడని వివరిస్తున్నారు. అయితే ఇటీవల వేలంలో ముంబై జట్టు బౌల్ట్‌ను మళ్లీ తీసుకోలేదు. దీంతో బుమ్రాపై ఒత్తిడి ఎక్కువ అయిపోతోంది. ఈ కారణంగా అతడి బంతులు గతి తప్పుతున్నాయి.

మరోవైపు ముంబై జట్టుగా విఫలం అవుతున్నా రోహిత్ బ్యాటింగ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. రోహిత్ పేలవ ఫామ్ ముంబై జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. ముంబై ఓటముల నేపథ్యంలో త్వరలోనే టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పిస్తే అతడి స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టే అర్హత హార్డిక్ పాండ్యాకు మాత్రమే ఉందని బెంగాల్ క్రీడా మంత్రి, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ లేదా భవిష్యత్ టీమిండియా కెప్టెన్‌గా ఫోకస్‌ అవుతున్న రిషబ్‌ పంత్‌కు సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదన్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ అద్భుతంగా రాణిస్తున్న హార్డిక్ పాండ్యాకే మెరుగైన అవకాశాలు ఉన్నాయని మనోజ్ తివారీ చెప్పాడు. కాగా ఈ సీజన్‌లో హార్డిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

కాగా ముంబై పరాజయాలకు బాధ్యత తనదే అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. తప్పేంటో తెలిస్తే సరిచేసేవాడినే.. కానీ అది బయటపడటం లేదు.. ప్రతి గేమ్ ఆడటానికి తనను తాను ప్రిపేర్ చేసుకుంటున్నా. అందులో తేడా లేదు. కాకపోతే సమస్య బయటకు రావడం లేదని రోహిత్ తెలిపాడు. టీం తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగా ఆ స్థితిలో ఉంచలేకపోయినందుకు పూర్తి బాధ్యత తనదే అన్నాడు. ఇన్నేళ్లుగా ఆడుతున్నట్లుగానే మళ్లీ తనకు తానే సపోర్ట్ చేసుకుని ఆడుతున్నానని.. ముందుకు వెళ్లడమనేది చాలా ముఖ్యమన్నాడు. ఇక్కడితో ప్రపంచం ముగిసిపోలేదని.. మళ్లీ పుంజుకుని తిరిగొస్తామని రోహిత్ పేర్కొన్నాడు.

IPL 2022: కేఎల్ రాహుల్‌కు షాక్.. రూ.12 లక్షలు జరిమానా