తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నాక పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోయాయి. అప్ఘన్లో ఎక్కడ చూసినా.. ఎవరినీ కదిలించినా హృదయ విదారక సంఘటనలే దర్శనమిస్తున్నాయి. తమ దేశంలోనే పరాయివాళ్లలా పొట్టచేత బట్టుకొని జీవించాల్సిన దుస్థితి అప్ఘన్లకు రావడం నిజంగా శోచనీయమనే చెప్పాలి. తాలిబన్ల చెర నుంచి తమను రక్షించాలని నిస్సాహాయ స్థితిలో అఫ్ఘన్లు ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతానికి భిన్నంగా తమ పాలన ఉంటుందని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. అయితే షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. మత చాందసవాదులైన తాలిబన్లు గతంలో షరియా చట్టాలను ఎలా అమలు చేశారో అక్కడి ప్రజలకు తెలుసు. దీంతో తాలిబన్ల పాలనలో ఉండటం కంటే అక్కడి నుంచి పారిపోవడమే బెటరని వారంతా భావిస్తున్నారు.
ఈ కారణంగానే అప్ఘన్లు పెద్ద సంఖ్యలో సరిహద్దుల్లో పక్కదేశాల అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే సరిహద్దు దేశాలు తమ భూభాగాలను మూసివేశాయి. అలాగే తాలిబన్లు సైతం ఇతర దేశాలకు, నగరాలకు వెళ్లే రహదారులన్నీంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో వారంతా ఎటూ వెళ్లలేని దుస్థితి నెలకొంది. దీనికితోడు తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు అంగీకరించడం లేదు. దీంతో ఆ దేశానికి ప్రపంచ దేశాల నుంచి రావాల్సిన నిధులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
దీంతో అప్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి మొత్తం కుదలైపోయింది. కరోనాకు తోడు ప్రపంచ దేశాల నుంచి సాయం నిలిచిపోవడంతో అప్ఘన్లో ప్రస్తుతం ఆకలి కేకలు రాజ్యమేలుతున్నాయి. నిన్నటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేన వారందరూ రోడ్డున పడాల్సి వచ్చింది. దీంతో కుటుంబ పోషణ వారికి భారంగా మారింది. ఈ నిస్సాహాయ స్థితిలో వారంతా ఇంట్లో ఉన్న వస్తులను అమ్ముకుంటున్నారు. వేల రూపాయాల వస్తువులను సైతం వచ్చిన ధరకు అమ్ముకుంటున్న దృశ్యాలు కాబుల్ నగరంలో కన్పిస్తున్నాయి. అయినా కొనేవాళ్లు కూడా కరువయ్యారు.
కాబూల్ వీధుల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా జనం ఫ్రిజ్‌లు.. టీవీలు.. సోఫాలు.. ఫర్నీచర్.. ఇలా ఏదో ఒకటి విక్రయిస్తూ కన్పిస్తున్నారు. ఒక్క పూటకు తిండి వస్తే చాలు అన్నట్లుగా అప్ఘన్ల పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాల్లేక రోడ్డున పడ్డారు. ప్రైవేటు, ఇతర రంగాల్లో పని చేసేవారే పరిస్థితి కూడా దయనీయంగా మారిపోయింది. తాలిబన్లు అధికారంలోకి రాకముందు దేశంలో 72శాతంగా ఉన్న పేదరికం ప్రస్తుతం 97శాతానికి పెరిగిందని ఐరాస పేర్కొంది. ఈ పరిస్థితి రానురాను మరింత దిగజారనుందని ఆందోళన వ్యక్తం చేసింది.
అప్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తగతం కావడంతో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నిధులను నిలిపివేసి ఆంక్షలు విధించాయి. దీంతో అప్ఘనిస్తాన్ రావాల్సిన నిధులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికే కరోనా అల్లాడిపోతున్న అగ్రరాజ్యాలు సైతం ఆ దేశానికి సాయం అందించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఐక్యరాజ్య సమితి అప్ఘనిస్తాన్ ను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. మానవతా దృక్పథంతో ఒక బిలియన్ డాలర్లను ఆదేశానికి అందించన్నట్లు ప్రకటించింది. ఈ నిధులపై కన్నేసిన తాలిబన్లు అక్కడి ప్రజలను ఏమేరకు ఆదుకుంటారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
