ఉక్రెయిన్ తో యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతున్న వేళ రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా దీనిని పేర్కొంటున్నారు. ఎలాంటి క్షిపణి రక్షణ వ్యవస్థనైనా ఇది ఛేదించగలదు. క్షిపణి పరీక్ష సూపర్ సక్సెస్ అని ప్రెసిడెంట పుతిన్ స్వయంగాప్రకటించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ డెడ్లీ మిసైల్ పేరు సర్మత్.
రష్యా అమ్ములపొదిలో వున్న కింజల్, అవాంగార్డ్ క్షిపణుల సరసన త్వరలో సర్మత్ చేరనుంది. అప్పుడు రష్యా వైపు చూడాలంటే శత్రువులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా పుతిన్ అన్నారు. ఆయన అంతలా ఆకాశానికి ఎత్తుతున్న సర్మత్‌కు నిజంగా అంత శక్తి ఉందా?
రాజధాని మాస్కోకు ఉత్తరాన 800 కి.మీ దూరంలో ఉన్న ప్లెసెట్స్క్ కాస్మోడ్రోమ్ నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఆర్‌ఎస్-28 సర్మత్‌ని ప్రయోగించారు. ఇందులో భాగంగా 6,000 కిమీ దూరంలోని కమ్చట్కా ఐలాండ్ లోని లక్ష్యాలను విజయవంతంగా చేధించింది. ఒకేసారి 10 కన్నా ఎక్కువ బహుళ వార్‌హెడ్‌లను మోసుకుపోగల ఈ మిసైల్ బరువు 200 టన్నుల పైమాటే. క్షిపణి పొడవు 35.3 మీటర్లు కాగా వ్యాసం 3 మీటర్లు. రష్యన్ మీడియా ప్రకారం, సర్మట్ మిస్సైల్ మూడు-దశల, ద్రవ ఇంధనంతో నడిచే 18,000 కి.మీ రేంజ్ క్షిపణి.
ఇందులోని ఒక్కో వార్‌హెడ్‌ను ఒక్కో లక్ష్యానికి గురిపెట్టొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అత్యాధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను అది బోల్తా కొట్టించగలదని అన్నారు. ప్రపంచంలో మరేదీ ఈ క్షిపణికి సాటిరాదని.. సమీప భవిష్యత్తులో అలాంటిది పుట్టుకురాబోదనీ పుతిన్ నమ్మకంగా చెపుతున్నారు. భూమిపై ఏ లక్ష్యాన్నయినాసరే సర్మత్‌తో టార్గెట్ చేయవచ్చు. రష్యా నుంచి ప్రయోగిస్తే అమెరికాలోని టెక్సాస్ మొత్తాన్నీ తుడిచిపెట్టేయగల సామర్థ్యం దీనికి ఉందంటున్నారు. అందుకేనేమో, తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.
భారీ వార్‌హెడ్‌లతో పాటు ఇది 16 చిన్న వార్‌హెడ్లను మోసుకెళ్లగలదని బావిస్తున్నారు. గంటకు 25 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల ఈ భీకర ఆయుధాన్ని రష్యా చాన్నాళ్లుగా అభివృద్ధి చేస్తోంది. మరికొన్ని పరీక్షలు పూర్తి చేసుకొని వచ్చే జూన్ నాటికి ఈ కొత్త క్షిపణి ఆపరేషన్ ప్రారంభమవుతుంది.
మరోవైపు, సర్మత్ గురించి పాశ్చాత్య విశ్లేషకులు మరోలా చెపుతున్నారు. నెక్ట్స్ జనరేషన్ క్షిపణులలో అజేయమైనదిగా పేర్కొంటున్నఈ క్షిపణి ప్రయోగాన్ని పుతిన్ న్యూక్లియర్ బెధిరింపుగా చిత్రీకరిస్తున్నారు. దీని వల్ల అమెరికా, దాని మిత్ర దేశాలకు వచ్చిన భయం ఏమీ లేదంటున్నారు. ఉక్రెయిన్‌లో ఎదురైన సైనిక వైఫల్యాలను కప్పిపుచ్చి రష్యా ప్రజల దృష్టిని మరల్చటమే మిసైల్ టెస్ట్ ఉద్దేశం అని అంటున్నారు.
సర్మత్‌ను రష్యా మొదటిసారి దీనిని 2017 డిసెంబర్ లోపరీక్షించింది. ఈ క్షిపణి శక్తి గురించి పుతిన్ ప్రగల్భాలు పలకడం ఇదే మొదటిసారి కాదని…అది నాటో రక్షణ శక్తిని పనికిరాకుండా చేస్తుందని అప్పుడు కూడా ఇలాగే అన్నాడని పాశ్చాత్య మీడియా గుర్తు చేసింది. పుతిన్ వ్యాఖ్యలను అమెరికా అధికారులు ఆనాడే కొట్టిపారేశారు. తాజా పరీక్షను కూడా వారు లైట్ తీసుకుంటున్నారు. పైగా దీని గురించి వారికి తెలియనిది ఏమీ లేదు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పరీక్షకు ముందే అమెరికాకు రష్యా విషయం తెలియజేసింది. అలాగే ఇప్పుడు ఈ ప్రయోగాన్ని కూడా అమెరికా ట్రాక్ చేసింది. కనుక, ఇలాంటి సాధారణ పరీక్షలు తమకు ఆశ్చర్యం కలిగించవంటోంది అమెరికా. తాము దీనిని పెద్ద ముప్పుగా భావించటం లేదని ప్రకటించింది.
నాటో దేశాలు SS-18 సాతాన్‌గా అభివర్ణించే సోవియట్ కాలం నాటి వోయివోడా ఐసీబీఎం లకు ఇది రిప్లేస్‌మెంట్ అంటున్నారు విశ్లేషకులు. అందుకే దీనిని వారు సాతాన్ 2 అని పిలుస్తున్నారు. ద్రవ ఇంధనంతో కూడిన సర్మత్‌ను అభివృద్ధి చేయడం అసలు సాతాన్ క్షిపణికి “ఫేస్‌లిఫ్ట్” ఇవ్వడం లాంటిదని న్యూక్లియర్ సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటికే ఉన్న SS-18కి సమానమైన సామర్థ్యంతో పాటు కొన్ని అదనపు మార్పులతో రూపొందించిన లేటెస్ట్ వెర్షన్ అంటున్నారు.
వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని మిస్సైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ప్రకారం SS-18 మాదిరగా సర్మత్ కూడా 18,000 కిలోమీటర్ల (11,185 మైళ్లు) రేంజ్‌తో విడి విడిగా టార్గెట్ చేసిన 10 కన్నా ఎక్కువ న్యూక్లియర్ వార్‌హెడ్లను మోసుకువెళుతుంది. కాంటినెంటల్ అమెరికాను చేరుకోవడానికి ఈ మాత్రం చాలు. వార్‌హెడ్‌లను బట్వాడా చేసే హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాన్ని కూడా ఈ క్షిపణి తీసుకువెళ్లగలదని అంటోంది.
ఉక్రెయిన్‌లో యుద్ధం రష్యా అనుకున్నట్టుగా సాగటం లేదు. కేవలం కొన్ని రోజుల్లో ఈ సంక్షోభం సమసిపోతుందని రష్యా మొదట్లో భావించింది. కానీ ఉక్రెయిన్ వీరోచిత ప్రతిఘటనతో రెండు నెలలు దాటింది. దీంతో రష్యా ఇప్పటికే ఈ యుద్ధంలో భారీ నష్టపోయింది. పెద్ద సంఖ్యలో సైన్యాన్ని కోల్పోయింది. గత వారం నల్లసముద్రంలో ప్రధాన యుద్ధ నౌక ధ్వంసమై మునిగిపోయింది. ఇది రష్యాకు పెద్ద అవమాన భారంగా మారింది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పుతిన్ సర్మత్‌ను తెరమీదకు తెచ్చాడనే వాదన కూడా ఉంది.
ప్రస్తుతం పుతిన్ తీరు.. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నియంత హిట్లర్‌ను తలపిస్తోంది. హిట్లర్ కూడా ఇలాగే ఆయుధాలు ప్రదర్శించి యుద్దంలో తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయనే భావన కల్పించేవాడు. అలా వాస్తవ పరిస్థితి నుంచి జనం దృష్టి మరల్చేవాడు. సర్మత్ గురించి చెప్పేటప్పుడు పుతిన్లో కూడా హిట్లర్ వాక్చాతుర్యం కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఉక్రెయిన్‌లో భూతల యుద్దం కొనసాగినంత కాలం సర్మత్ మిసైల్ ఎలాంటి ఆచరణాత్మక ప్రభావం చూపదంటున్నారు. ఇది ఒక వ్యూహాత్మక ఆయుధం మాత్రమే. ప్రచ్ఛన్న యుద్ధానికి ముందున్న SS-18 వలె యునైటెడ్ స్టేట్స్‌ను తాకడానికి రూపొందించబడింది.
రష్యా మాదిరిగానే ఆమెరికాకు కూడా దాని స్వంత ఐసీబీఎంల మీద నమ్మకం ఉంది. బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, అణు-సామర్థ్యం గల వ్యూహాత్మక బాంబర్లు కూడా దాని వద్ద ఉన్నాయి. కనుక, అవి పుతిన్ తన “సాతాన్ II” ను ఉపయోగించకుండా బలమైన నిరోధకంగా పనిచేస్తాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండాలనే అమెరికా తన స్వంత క్షిపణి కార్యక్రమాలను వాయిదా వేసింది. ఈ కారణంగానే ఈ నెల మొదట్లో జరగాల్సిన మినిట్‌మ్యాన్ III ఐసీబీఎం పరీక్షను రద్దు చేసింది. కనుక సర్మత్‌పై వెస్ట్రన్ వెర్షన్‌ను బట్టి పుతిన్ బెధిరింపులు ఉత్తుత్తివే అని అర్థమవుతోంది.
