గోవా బీజేపీలో అసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే నెలలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థుల జాబితా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 40 శాసన సభ స్థానాలకు గాను గురువారం 34 అభ్యర్థుల పేర్లు వెల్లడించింది . ఐతే, ఎప్పటి లాగే ఇది కొందరికి రుచించలేదు. దాంతో పార్టీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది.
సిట్టింగ్ మినిస్టర్ తో పాటు మాజీ సిఎం కుమారుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఒక డిప్యూటీ సీఎం భార్య పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ నేతలందరూ తమ తమ నియోజకవర్గాలలో రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగే యోచనలో ఉన్నారు.
గోవా లోని ప్రమోద్ సావంత్ ప్రభుత్వంలో పిడబ్ల్యుడి మంత్రి దీపక్ పౌస్కర్, డిప్యూటీ స్పీకర్ ఇసిడోర్ ఫెర్నాండెజ్ , డిప్యూటీ సిఎం చంద్రకాంత్ కవ్లేకర్ భార్య సావిత్రి కవ్లేకర్, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీకి గుడ్‌బై చెప్పిన వారిలో ఉన్నారు.
పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉత్పల్ పారికర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పనాజీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ నుంచి నిష్క్రమించటం కష్టమైన నిర్ణయమే అయినా తప్పలేదని అన్నారు. ఐతే, పనాజీ నియోజకవర్గంలో ఉత్తమ అభ్యర్థిని బరిలో దించితే తాను పోటి నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ఉత్పల్.
ఉత్పల్ తండ్రి మనోహర్ పారికర్ దాదాపు పాతకేళ్లు ప్రాతినిధ్యం వహించిన పనాజీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఉత్పల్‌కు పార్టీ మోండిచేయి చూపటం తీవ్ర వేదనకు గురిచేసింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ఆయన ప్రకటించటం గోవా రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్పల్ పారికర్ కోరుకుంటున్న పనాజీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అటనాసియో మోన్సెరేట్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈయన 2019లో కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు. ఐతే, ఆయనపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. మైనర్ బాలిక రేప్ కేసు కూడా ఉంది ఆయనపై. అలాంటి వ్యక్తికి బీజేపీ టికెట్ ఎలా ఇచ్చిందన్నది ఆయన ప్రశ్న.
2019 లో మనోహర్ పరికర్ మృతితో పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పుడు కూడా ఉత్పల్‌కు పార్టీ టికెట్ దక్కలేదు. ప్రజా మద్దతు ఉన్నా కూడా తన అభ్యర్థిత్వాన్ని పార్టీ నిరాకరించింది. ఐనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించానన్నారు.
ఉత్పల్ పారికర్ రాజీనామాతో గోవా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయనను తమ పార్టీ టికెట్ పైనే పోటీ చేసేలా నచ్చ చెప్పేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పనాజీ కాకుండా వేరే చోటు నుంచి పోటీ చేయాలని పార్టీ సూచిస్తోంది. కానీ, తన తండ్రిని ఆదరించిన స్థానమే కావాలని ఆయన పట్టుపటట్టారు. మరోవైపు, గోవాలో బలపడాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్పల్ పారికర్‌ని పార్టీలోకి ఆహ్వానించింది. ఆప్ అభ్యర్థిగా పనాజీ నుంచి పోటీ చేయాలని కోరింది. మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
నిజానికి, గత ఐదేళ్లలో గోవాలో జరిగినన్ని ఫిరాయింపులు మరెక్కడా జరగలేదు. మొత్తం నలబై మంది ఎమ్మెల్యేలలో 24 మంది పార్టీ మారారు. అంటే ఎన్నికైన శాసన సభ్యులలో 60 శాతం మంది గెలిచిన పార్టీకి పంగనామాలు పెట్టి మరో పార్టీలోకి మారారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఎన్నడూ ఇలా జరగలేదు.
గత ఐదేళ్లలో గోవా శాసన సభ్యుల ఫిరాయింపులు చూస్తే ప్రజానిర్ణయానికి ఏమాత్రం విలువ లేదని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటు అలంకార ప్రాయం మాత్రమే అని చెప్పటానికి ఇంతకన్నాగొప్ప ఉదాహరణ ఉంటుందా. రాజకీయ క్రీడలో ఎప్పుడూ నేతలే గెలుస్తారు..ప్రజలే ఓడిపోతారు.. ఓడిపోతూనే ఉంటాడు.
2017-22 మధ్య కాలంలో ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలలో విశ్వజిత్ రాణే, సుభాష్ శిరోద్కర్, దయానంద్ సోప్టే కూడా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వీరు తరువాత బీజేపీలో చేరారు. 2019లో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు. వారిలో సీఎల్పీ లీడర్ చంద్రకాంగ్ కేవ్లేలకర్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) ఎమ్మెల్యేలు దీపక్ పౌస్కర్ (సంవోర్డెం), మనోహర్ అజ్‌గావ్‌కర్ (పెర్నెం) కూడా ఇదే సమయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
సాలిగావ్ కు చెందిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి) నేత జయేష్ సల్గోంకర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి నాయక్ ఇటీవల అధికార బీజేపీలో చేరారు. మరో మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు లూయిజిన్‌హో ఫె లేరో ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఎంసీలోకి వెళ్లారు. 2017లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) టికెట్‌పై గెలిచిన మాజీ సిఎం చర్చిల్ అలెమావో కూడా ఇటీవల టిఎంసికి మారారు.
మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లౌరెన్కో కూడా తృణమూల్ కండువా కప్పుకున్నాడు. అయితే, ఆయన టీఎంసీ కి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలనుకున్నారు, కానీ తీసుకోలేదు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ మొత్తం ఫిరాయింపుల పర్వంలో కాంగ్రెస్ పార్టీయే అత్యధికంగా నష్ట పోయింది.
2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 14 సీట్లు సాధించగా, బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏ 13 సీట్లు గెలిచింది. ఐనా, అధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు అధికారం దక్కనీయకుండా పోస్ట్ పోల్ మేనేజ్‌మెంట్‌తో బీజేపీ తిరిగి పవర్‌లోకి వచ్చింది. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ బలం 17 నుంచి 2 సీట్లకు పడిపోగా..13 సీట్లు గెలిచిన బీజేపీ బలం 27కు చేరటం విచిత్రం.
దీనిని కాంగ్రెస్ చేతకాని తనం అనాలో…బీజేపీ రాజనీతి అనాలో ఎప్పటికీ అర్థం కాదు. గత ఐదేళ్లలో జరిగిన జంపింగ్ జపాంగ్‌లను చూస్తే ఓటు ఎవరికి వేయాలో సామాన్యుడికి అర్థం కాదు. ఓటేసిన పార్టీలో అతడు ఎలాగూ చివరి వరకు ఉండడనే భావన ఇప్పటికే వచ్చింది. గోవా రాజకీయాలను చూస్తే ఇదే అర్థమవుతుంది.
…….
