Site icon NTV Telugu

President Election : బీజేపీ, టీఆర్‌ఎస్‌కు పరీక్ష రాష్ట్రపతి ఎన్నిక.!

President Elections

President Elections

జులైలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి ఐక్య పోరాటం చేయవచ్చనే అందోళన బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలో, అధికార పార్టీ ముందుగానే అప్రమత్తమై కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలపై దృష్టి సారించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు గల ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఇందులో ప్రతిపక్షాల ఉమ్మడి బలం బీజేపీ, దాని మిత్రపక్షాల కంటే కాస్త ఎక్కువగా ఉంది. కనుక, ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే బీజేపీకి ఇబ్బందే.

అధ్యక్ష పదవికి సంఖ్యాబలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు తీవ్రంగా చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ పట్ల దూకుడుగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ వంటి పార్టీలతో ఈసారి బీజేపీకి సవాల్‌ పెరిగిందనే మాటలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. మరోవైపు, కమలం పార్టీ అనిశ్చిత మిత్రుడు నితీష్‌ కుమార్‌ విపక్షాల వైపు వెళ్లినా వెళ్ళ వచ్చనే భయంతో ఆ పార్టీ అధినాయకత్వం అప్రమత్తమైంది.

ఈ నేపథ్యంలో ఒడిషాలో బీజేడీ, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మద్దతును పక్కా చేసేందుకు, అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్ష శిభిరంలోకి జారకుండా కనిపెట్టే పనిని బీజేపీ నాయకత్వం ఇప్పటికే తమ పార్టీ నేతలను అప్పజెప్పింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల పాట్నా వెళ్లి నితీష్‌తో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఎన్‌డీఏలో ఉన్నప్పుడు యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్‌డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కి మద్దతిచ్చిన ఘనుడు నితీష్‌. అందుకే, ఆయన విషయంలో బీజేపీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

ప్రాంతీయ పార్టీల అధినేతలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోవటంతో పాటు వారికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని వెతికే పనిలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్‌డీఏ తరపున వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళను రంగంలోకి దించే అవకాశం ఉందనే టాక్‌ ఢిల్లీ రాజకీయ వర్గాలలో ఉంది. బీజేపీ గతసారి దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రంగంలోకి దింపిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టిఆర్‌ఎస్‌ మినహాయిస్తే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలైన బీజేడీ, వైఎస్‌ఆర్‌సిపిలు తప్పకత తమకు మద్దతు ఇస్తాయని బీజేపీ నాయకత్వం గట్టి నమ్మకంతో ఉంది. ఐతే, బీజేపీ వారిపై మరీ అంత గుడ్డి నమ్మకంతో ఉండటం కూడా మంచిది కాదని బీజేపీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి తనకు నచ్చితే ఒడిషా ముఖ్యమంత్రి నవీన పట్నాయక్‌ బీజేపీ కి ఇచ్చినా ఆశ్చర్యం లేదనే వాదన కూడా పార్టీలో ఉంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాలను బీజేపీ నిలబెట్టుకున్నప్పటికీ 2017 రాష్ట్రపతి ఎన్నికలతో పోల్చితే ఎన్‌డీఏ పరిస్థితి ఇప్పుడు బలహీనంగా ఉంది. నాడు, ఎన్‌డిఎ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ సునాయాస విజయం సాధించారు.

2017 ప్రాంతంలో దేశంలో 21 రాష్ట్రాల్లో ఎన్‌డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు, బీజేపీ, దాని మిత్రపక్షాల అధికారం 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి పడిపోయింది. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు బీజేపీకి దూరమయ్యాయి. మారిన ఈ రాజకీయ చిత్రంలో బీజేపీ 2017 లా సునాయాసంగా తమ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి లేదు.

రాష్ట్ర జనాభా, సీట్ల సంఖ్య ఆధారంగా.. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు , ఎమ్మెల్యేల ఓటు విలువ నిర్ణయించబడుతుంది. కాబట్టి జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువగా ఉంది. ఇది కూడా బీజేపీకి సవాలుగా మారవచ్చు.

ఈ కారణంగానే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందనే అపవాదును బీజేపీ మూటగట్టుకుంది.తాజాగా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. అవినీతి ఆరోపణలతో ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జూలై 24లోపు రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి వుంటుంది. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించటం పక్కా. అందుకే బీజేపీ ఇప్పటి నుంచే వాటికి గాలం వేస్తోంది. టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుతో ఇటీవల బీజేపీ పట్ల దూకుడుగా ఉన్నప్పటికీ ..రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కాషాయ పార్టీ పెద్దలు ఆయనతో కూడా టచ్‌లో ఉంటారని బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు, తెలంగాణ రాష్ట్ర సమితి ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవేళ కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తే బీజేపీ చేతికి పెద్ద ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది. అలా కాకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతిస్తే ఆ పార్టీపై ఇన్నిరోజుల ఆయన దూకుడుకు అర్థం ఉండదు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే అనే మెసేజ్‌ని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతుంది. కనుక, రెండు శిభిరాల రాష్ట్రపతి అభ్యర్థుల ప్రకటన తరువాత బహుశా టీఆర్‌ఎస్‌ తన వైకరిపై నిర్ణయం తీసుకోవచ్చు.

జూన్‌లో రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల ద్వారా జాతీయ రాజకీయాల్లో తన తదుపరి అడుగులు వేయాలని టీఆర్‌ఎస్ అధినేత నిర్ణయించుకున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు గల భారీ మెజార్టీ దృష్ట్యా ఆ మూడు సీట్లను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంటుంది. గత వారం ఎన్నికల సంఘం ఒక రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెలాఖరులోగా మిగిలిన రెండు స్థానాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఐతే, దానితో సంబంధం లేకుండా మే 19 లోపు ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి.

ఈ ఏడాది మొదట్లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు చేసే ఉద్దేశంతో తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పర్యటించి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల అడుగులు వేసిన ఆయన ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును నిరసిస్తే ఏప్రిల్ 11న ఢిల్లీలో దీక్ష కూడా చేశారు. కానీ, ఆ తర్వాత ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డీఏకి వ్యతిరేకంగా బీజేపీ యేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్‌ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని నిలబెట్టడంపై ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించటం ఆయన పర్యటన ఉద్దేశాలలో ఒకటి.

అయితే కాంగ్రెస్‌తో చేతులు కలిపే విషయంలో ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి మమతా బెనర్జీ సుముఖంగా లేరు. మరోవైపు, డీఎంకే, శివసేన, ఎన్సీపీలు కాంగ్రెస్‌కు అనుకూలం. ఈ పరిస్థితిలో ప్రతిపక్షాల ఐక్యత అనుమానమే. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నందున టీఆర్‌ఎస్ దానితో కలిసి పనిచేయడానికి సుతారం ఇష్టపడదు. పైగా, ఇటీవల వరంగల్‌ బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ని గద్దె దించుతామని ప్రతినబూనారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. అలాగే, ప్రతిపక్షాల ఐక్యతకు కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికలు పెద్ద పరీక్ష అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Exit mobile version