కరోనా ఎంట్రీతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇదే సమయంలో వాహనరంగం స్తంభించిపోయింది. ఈ కారణంగాపెట్రో ఉత్పత్తుల వాడకం భారీగా తగ్గింది. బ్యారెల్ చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్రో, డీజిల్ ధరలు నేలచూపులు చూశాయి. అయితే భారత్ లో ఇందుకు విరుద్ధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం శోచనీయంగా మారింది. గత కాంగ్రెస్ పాలనలో పెట్రోల్ ధరలు రూ.60 రూపాయలు ఉంటే ఇప్పుడది ఏకంగా సెంచరీని దాటేసింది. దీంతో పెట్రో ఉత్పత్తులను సైతం జీఎస్టీలోకి తీసుకు రావాలని వాహనదారుల నుంచి కొంతకాలంగా డిమాండ్లు వస్తున్నాయి.
కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ ధర ఒక్క రూపాయి పెరిగితే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు నిరసన, రాస్తారోకోలతో హడలెత్తించేవి. కానీ మోదీ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయాలు దాటిపోయినా ప్రతిపక్షాలు మాత్రం నిరసనలు చేసేందుకు జంకుతున్నాయి. మోదీ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధర సైతం ఏకంగా వెయ్యి రూపాయలు దాటిపోయింది. పెట్రో ఉత్పత్తుల ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా పెరగడంతో నిత్యావసర ధరలు సైతం ఆకాశాన్ని అంటుకున్నాయి. దీంతో వాహనదారులు,పేద, సామన్య ప్రజల నుంచి మాత్రం బీజేపీ సర్కారుపై పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
కరోనా ఎఫెక్ట్ కు తోడు, పెరిగిన నిత్యావసర, పెట్రో ఉత్పత్తుల ధరలు మోదీ గ్రాఫ్ ను క్రమంగా దిగజారుస్తున్నాయి. దీంతో గతంలో కంటే ఎన్డీఏ సర్కారుపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినట్లు కన్పిస్తుంది. ఈక్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కళ్లెం వేసేందుకు వీటిని సైతం జీఎస్టీలోకి తీసుకురావాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రో, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకొచ్చే అంశంపై 45వ జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం సరైన నిర్ణయం కాదని ఆమె తేల్చేశారు.
జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొని రావడానికి పలు రాష్ట్రాలు అంగీకారం తెలుపడం లేదన్నారు. దీని ప్రభావం రాష్ట్ర, కేంద్ర ఆదాయంపై భారపడనుంటమే ఇందుకు కారణమని ఆమె తెలిపారు. ఇక జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు విలాస, హానికారక ఉత్పత్తులపై పన్ను విధించనున్నారు. తొలుత అనుకున్నట్లుగా 2017 జులై నుంచి ఐదేళ్లపాటు మాత్రమే రాష్ట్రాలకు ఈ పరిహారం అందించనున్నారు. కాగా పన్ను వసూళ్లు మాత్రం 2026 మార్చి వరకు కొనసాగనుంది.
ఇక కొవిడ్ కారణంగా ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్న రాష్ట్రాలు వాటిని తీర్చేందుకు ఈ నిధిని ఇవ్వనున్నారు. మొత్తానికి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలోకి తేవడం అటూ రాష్ట్రాలకు, ఇటూ కేంద్రానికి కానీ ఇష్టం లేదని తేటతెల్లమైంది. మరోవైపు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై కేరళ హైకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. దీనిపై కేంద్రం సైతం రాష్ట్రాలు సముఖంగా లేవనే కారణాన్ని చూపి తప్పించుకునే అవకాశం కన్పిస్తుంది. కేంద్రం ఇచ్చే వివరణపై కేరళ హైక్టోర్టు ఎలా రియాక్టవుతుందో వేచిచూడాల్సిందే..!
