Site icon NTV Telugu

NTV Specials: రాహుల్‌ పర్యటనతో మారిన తెలంగాణ రాజకీయం!

Rahul Gandhi

Rahul Gandhi

రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన కాంగ్రెస్‌ క్యాడర్‌లో జోష్ నింపింది. వరంగల్ సభ సక్సెస్ పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తన పర్యటన రెండవ రోజు హైదరాబాద్‌లో పలు సమావేశాలు నిర్వహించారు. ముందుగా చెంచల్‌గూడ జైలుకు వెళ్లి ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను పరామర్శించారు. తరువాత గాంధీ భవన్ లో వివిధ విభాగాలకు చెందిన పార్టీ నేతలను కలిశారు. తాజ్ కృష్ణా హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారులతో కూడా సమావేశమయ్యారు. వారితో పాటు తెలంగాణ మేధావులు, జర్నలిస్టులను కూడా ఆయన మాటామంతీ జరిపారు. ప్రజాగాయకుడు గద్దర్ తో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కళాకారులు, రచయితలు, విద్యా ప్రముఖులను కూడా రాహుల్ కలిశారు. రాహుల్‌ను కలిసిన వారిలో ఎక్కువ మంది సీఏం కేసీఆర్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న వారే కావటం గమనార్హం.

రాహుల్ గాంధీ పర్యటనలో ప్రధానమైనది వరంగల్‌లో జరిగిన “రైతు సంఘర్షణ సభ” సభ. ఈ సభలో ఆయన ఏం చెప్పారనేది ముఖ్యంగా చెప్పుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నదో రాహుల్‌ గాంధీ చాలా విస్పష్టంగా వివరించారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా అనవసరం మాటలు ధ్వనించ లేదు. సూటిగా ..సుత్తి లేకుండా విషయం చెప్పారు.

వరంగల్‌ సభ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగించినట్టుగా ఉంది. పేరుకు వరంగల్‌ డిక్లేరేషన్‌ కావచ్చు..కానీ దానిని పరిశీలిస్తే అది వచ్చేఅసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టోగా కనిపిస్తుంది. కేసీఆర్‌ సర్కార్‌ పాలనాపరమైన, విధాన పరమైన వైఫల్యాల నుంచి, విపక్షాల విమర్శల నుంచి కాంగ్రెస్‌ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్నామ్నాయంగా తనను తాను చూపించుకోవాలనే ప్రయత్నంగా రాహుల్‌ ప్రసంగాన్ని చూడవచ్చు.

ప్రభుత్వాన్ని విమర్శించటం, అధికారంలో ఉన్నవారిని అదే పనిగా దూషించటం ఇప్పుడు బహిరంగ సభలలో చాలా సాధారణం. కానీ వరంగల్‌ సభలో అలాంటివేమీ లేవు. కేసీఆర్‌ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిన హామీలను తాము పూర్తి చేస్తామని తెలంగాణ ప్రజలకు ఈ సభ ద్వారా స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ సరిగా అమలు చేయలేదనే విమర్శులు ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించలేకపోయింది. తాను దగ్గరుండి ఈ పంచాయితీని తేలుస్తానని కేసీఆర్‌ అనేక మార్లు చెప్పారు. కాని అదేదీ జరగలేదు కాబట్టి కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే తక్షణం పోడు భూముల సమస్య పరిష్కరిస్తుందని హామీ ఇచ్చింది.

అలాగే గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశం. గిరిజన జనాభాకు అనుగుణంగా వారికి పది శాతం రిజర్వేషన్లు ఉండాలని తెలంగాణ అసెంబ్లీ గతంలో తీర్మానం చేసి పంపింది. కానీ అది వాస్తవ రూపం దాల్చేలా చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయి. అందుకే కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా రిజర్వేషన్‌ హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే పదిశాతం గిరిజన రిజర్వేషన్లు అమలుచేస్తామని చెప్పింది. అంతేకాదు, గిరిజన సమస్యలను మరింత బలంగా హైలైట్‌ చేసేందుకు త్వరలో ఇలాంటిదే మరో సభ పెడతానని చెప్పటం గమనార్హం.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఐతే, వాటిలోని లోటుపాట్లను తనకు అనుకూలంగా మలచుకుంటూ కాంగ్రెస్‌ తెలివిగా ప్లాన్‌ చేసింది. రైతు బంధు ద్వారా రైతుకు ఏడాదికి ఎకరాకు ఇచ్చే రూ.10,000 ను తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరమ్మ రైతు భరోసా దానిని రూ.15,000కు పెంచుతాని వరంగల్‌ డిక్లేరేషన్‌ పేర్కొంది.

ప్రస్తుతం కేసీఆర్‌ సర్కార్‌ అమలు చేస్తున్న రైతుబంధు కౌలు రైతులకు వర్తించుట లేదు. దీనిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కౌలు విధానం పెరిగింది. ఏడాదికి ఎకరాకు రూ. 12,000 నుంచి రూ.15,000 వరకు కౌలుదార్లు చెల్లిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది వారికి మోయలేని భారంగా మారింది. అందువల్ల కౌలురైతులకు కూడా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి రూ.12,000 ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అలాగే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తామని పేర్కొంది.

కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న విమర్శలు, ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉన్ని వివిధ అంశాల ఆధారంగా కాంగ్రెస్‌ చాలా నిర్ధిష్టంగా వరంగల్ డిక్లేరేషన్ కు రూపకల్పన చేసిందని అర్థమవుతోంది. వరికి కనీస మద్దతు ధర రూ. 2500 ఇస్తాననటంతో పాటు పత్తి, మిర్చి, పసుపు వంటి పంటలకు కూడా మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పటం అందులో భాగమే.

వీటితో పాటు ఇంకా అనేక అంశాలపై పార్టీ వైకరిని రాహుల్‌ గాంధీ సూటిగా చెప్పారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసి దోచుకున్న టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య నేరుగా పోరు ఉంటుందని, టీఆర్‌ఎస్‌ను ఓడించితీరుతామన్నారు. టీఆర్‌ఎస్‌కు తామే ప్రధాన ప్రత్యర్థినని బీజేపీ చెప్పుకుంటున్న సమయంలో అధికార పార్టీకి తన పార్టీని ఏకైక ప్రత్యామ్నాయంగా ఉంచడానికి రాహుల్‌ వరంగల్‌ సభ ద్వారా ప్రయత్నించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు అంశాన్ని పరోక్షంగా లేవనెత్తినా కూడా పార్టీ నుంచి బయటకు పంపించేస్తామన్నారు. ఎంత పెద్ద కాంగ్రెస్ నేతలైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు సంబంధించిన ఇటీవలి పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపై రాహుల్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పీకే ఓ వైపు కాంగ్రెస్‌లో చేరుతూనే .. మరోవైపు టీఆర్‌ఎస్‌తో వ్యాపార బంధం కొనసాగిస్తారని వచ్చిన వార్తా కథనాలను బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ రెండూ ఒకటే అన్నట్టు మాట్లాడింది. అందుకే ఆయన వ్యూహాత్మకంగా వరంగల్‌ సభలో బీజేపీపై తీవ్రస్థాయి విమర్శలకు వెళ్లలేదని చెప్పవచ్చు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా వారి పనితీరు పైనే ఆధారపడా ఉంటుందని రాహుల్ గాంధీ ప్రకటించటం పార్టీ కోసం నిజంగా కష్టపడి పనిచేసే వారిలో ఉత్సాహం నింపుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.. ప్రజల పక్షాన నిలబడి వారి ప్రయోజనాల కోసం పోరాడే నాయకులకే టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పటం అరుదైన విషయం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్టీ చేపట్టే ఆందోళనలకు అందుబాటులో ఉంటానని ప్రకటించడం ద్వారా తెలంగాణపై ఆయన పూర్తిగా దృష్టి సారించారని అర్థమవుతోంది.

మరోవైపు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరంగల్ సభపై స్పందించారు. రాజకీయ పర్యాటకులు వస్తారు..వెళతారు. తెలంగాణలో కేసీఆర్ మాత్రమే ఎప్పటికీ ఉంటారు అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే శనివారం వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంసందర్భంగా రాహుల్‌ గాంధీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. దేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొనే వారు ఎవరైనా ఉన్నారా? పొత్తు కావాలని కాంగ్రెస్‌ను ఎవరైనా అడిగారా? కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరని కౌంటర్‌ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల గురించి పార్లమెంటులో రాహుల్‌ ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ నేతలు చెప్పిన మాటలను ఎవరూ నమ్మవద్దని కేటీఆర్‌ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇది ఇలావుంటే, రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ చేసిన “టూరిస్టు” వ్యాఖ్యలపై ‌టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి స్పందించారు. కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు! కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా… దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే అని ట్వీటర్‌ వేదిక కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద వరంగల్‌ సభ ద్వారా తెలంగాణ రాజకీయాలు టీర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చుట్టూ తిరుగుతాయనటంలో సందేహం లేదు.

Exit mobile version