NTV Telugu Site icon

NTV Specials : మూడోసారీ మోడీయే ప్రధాని..!

Modi 3rd

Modi 3rd

ప్రధాని నరేంద్ర మోడీ తాను మూడోసారి ప్రధాని కావటంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూడవసారి ఏం ఖర్మ..ఎన్నిసార్లయినా కావచ్చు అనేలా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. ప్రధాని మోడీ కామెంట్స్‌ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి.

గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పొందుతున్న వృద్ధులు.. వితంతువులు ..పేద ప్రజలతో మోడీ రెండు రోజుల క్రితం వర్చువల్‌ గా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత ఒకరు తనను కలిసి మోడీజీ.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిని చేసింది. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారని అడిగారని చెప్పారు. రెండుసార్లు ప్రధాని అయితే అన్నీ సాధించినట్టేననే అభిప్రాయంతో ఆ నాయకుడు ఉన్నారని, కానీ మోడీ అందరికంటే భిన్నమని ఆయనకు తెలీదు అని చెప్పుకొచ్చారు.

దీనిని బట్టి 2024లో కూడా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీయే అనే విషయం స్పష్టమైంది. ఎన్నికలకు ఇంకా రెండేన్నర ఏళ్ల సమయం ఉంది. ప్రధాని పదవి మీద ఎవరూ ఆశపెట్టుకోవద్దని చెప్పేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానం కలుగుతుంది. 2024 తరువాత మోడీ ప్రధాని రేసుకు దూరంగా ఉంటారని బావించే వారికి మోడీ దీంతో క్లారిటీ ఇచ్చారా? అదే నిజమైతే, ఆ ఆశ ఉన్నవారు మరి కొన్నేళ్ల పాటు తమ ఆశలకు నీళ్లు వదిలేయాల్సిందే.

నిజానికి, నరేంద్ర మెడీకి గల రాజకీయ పలుకుబడి దృష్ట్యా ఆయన మూడో దఫా కూడా తానే ప్రధాని కావాలనుకోవటం సహజం. మూడవ సారి ప్రధాని కాకూడదు అనే నిబంధన మన రాజ్యాంగంలో లేదు. ఎంత కాలమైనా కొనసాగే పెసులుబాటును భారత రాజ్యాంగం కల్పించింది. అందుకే రాజకీయాలలో రిటైర్మెంట్లు చాలా తక్కువ.

ఇప్పుడు మోడీ వయస్సు 71 ఏళ్లు. ఆ వయసు వారు చాలా మంది కన్నా మోడీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. చిన్నవాడైన రాహుల్ గాంధీ కన్నా మోడీకే సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఎక్కువ. మోడీ పాలన పట్ల కూడా యువతలో విశ్వాసం ఉంది. కనుక 2024 ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధిస్తే మరోసారి ఆయన ప్రధాని అయితే అభ్యంతరం ఏమిటి. పార్టీ విధానపరంగా అభ్యంతరాలు ఉంటే చెప్పలేం. కానీ, బీజేపీలో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా…అంటే లేదనే చెప్పాలి. పార్టీలో కూడా ఇప్పటికిప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయం లేనపుడు అభ్యంతరాలు ఎందుకు ఉంటాయి.

మోడీ సమ్మోహన శక్తికి సాటిరాగల వారు బీజేపీలో ప్రస్తుతం ఎవరూ లేరు. యోగీ ఆధిత్యనాథ్‌ తయారువుతున్నారు. కానీ అందుకు ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే, బీజేపీ కేవలం తన కోర్‌ ఓటుతో 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేదు. బీజేపీ, ఆరెస్సెస్‌ భావజాలానికి అతీతంగా మోడీ ఓటర్లు ఆకట్టుకున్నారు. అందుకే ఆయన ఒక ప్రత్యేకమైన నాయకుడుగా గుర్తింపు పొందారు.

ఆరెస్సెస్‌ భావజాలంతో ప్రభావితమైన బీజేపీ కోర్‌ ఓటు బేస్‌కు మోడీ చరిష్మా తోడైంది. ఇదే సమయంలో మోడీతో సరితూగ గలిగిన ప్రత్యర్థి ప్రతిపక్ష శిభిరంలో లేరు. వివిధ కారణాలతో కాంగ్రెస్‌ పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఈ మూడు కారణాలతో మోడీ వరస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అంటే, బీజేపీ, ఆరెస్సెస్‌ సిద్దాంతాలు చూసి చాలా మంది మోడీకి ఓటు వేయలేదు. కాంగ్రెస్‌ పాలనలో పేరుకుపోయిన అవినీతి, కుంభకోణాలతో విసుగు చెంది వేరే దారి లేక బీజేపీని గెలిపించారు.

మరోవైపు, నరేంద్ర మెడీపై నమ్మకం ఇప్పటికీ మెజార్టీ ప్రజలలో చెక్కు చెదరకుండా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు, బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలలో కూడా మోడీకి మద్దతు లభించింది. 2018 లో తెలంగాణ అసెంబ్లీలో కేవలం ఒక్క సీటు గెలిచిన బీజేపీ .. కొన్ని నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు ఎలా దక్కించుకుంది? అలాగే, 2016 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో మూడు సీట్లకు పరిమితమైన ఆ పార్టీ 2019 లోకసభ ఎన్నికలలో ఏకంగా 18 సీట్లు ఎలా సాధించింది? ఇవి మాత్రమే కాదు రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌ కూడా ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రధానిగా మోడీ అత్యంత సమర్థుడని జనం నమ్మటమే దీనికి కారణం.

బహుశా ఈ ట్రెండ్‌ 2024లో కూడా కొనసాగవచ్చు. కారణం, ఇప్పటికీ ప్రతిపక్షంలో మోడీకి ధీటైన నేత ఆవిర్భవించలేదు. కాంగ్రెప్‌ నేత రాహుల్‌ గాంధీ గతంలో కన్నా ఇప్పుడు మెరుగైన రాజకీయ పరిణితితో ఉన్నారు. అలాగే, ఇటీవలి పంజాబ్‌ విజయంతో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో ఉన్నారు. కానీ, వారు ఇప్పటికిప్పుడు మోడీని ఢీ కొట్టగలరా అనేది అనుమానమే.

మొత్తం మీద ప్రస్తుతం భారత ప్రజలతో మోడీకి ఓ ప్రత్యేకమైన సంబంధం..అనుబంధం ఏర్పడింది. అందుకే ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ప్రకటిస్తున్నారు. పాలనా పరంగా అసంతృప్తి ఉన్నప్పటికీ సర్దుకుపోవటానికి కారణం కూడా ఆ ప్రత్యేక బంధమే. కునుక వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపునకు మెరుగైన అవకాశాలు ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది .. అప్పటికి రాజకీయాలు ఎలా మారుతాయో ఊహించలేం.