Site icon NTV Telugu

NTV Specials : సామాన్య ప్రేక్షకుడు.. బాలీవుడ్‌ సినిమా మధ్య అంతరం పెరిగిందా…!

Bollywood Vs South

Bollywood Vs South

బాలీవుడ్ ఎంట్రీపై హీరో మహేష్ బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. హిందీలో ఆఫర్లు ఉన్నప్పటికీ బాలీవుడ్‌ నిర్మాతలు తనను భరించలేరన్న ఆయన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ రంగం నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తాజాగా నటి కంగనా రనౌత్‌ మహేశ్‌ బాబుకు మద్దతుగా మాట్లాడారు. మహేశ్‌ బాబు అన్నది నిజమే…ఆయనను బాలీవుడ్‌ భరించలేదని చెప్పింది. ఆయనకి తగిన రెమ్యునరేషన్‌ని బాలీవుడ్‌ ఇవ్వలేదని కూడా చెప్పింది. అంతేకాకుండా టాలీవుడ్‌ను చూసి చాలా నేర్చుకోవాలంటూ చెప్పుకొచ్చింది. కంగన్‌ చెప్పింది నిజమే. టాలీవుడ్‌ సినిమా ఈ స్థాయికి చేరటానికి మహేశ్‌బాబు వంటి ఈ తరం హీరోలు, దర్శకులు ఎంతో కష్టపడ్డారు. దక్షిణాది సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న తమిళ సినిమాను కూడా తెలుగు పరిశ్రమ వెనక్కి నెట్టింది. అది వేరే విషయం! కానీ ఇప్పడు సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ మీద ఎక్కువ చర్చ నడుస్తోంది. కంటెంట్‌ పరంగా, కలెక్షన్ల పరంగా దక్షిణభారత సినిమాలు హిందీ సినిమాను దాటిపోవటమే ఈ చర్చకు ప్రధాన కారణం. రాజమౌళి బాహుబలి నుంచి ఈ చర్చ మొదలైంది. అంతకు ముందు ఇలాంటి చర్చ లేదు. హిందీ సినిమాకు ప్రాంతీయ చిత్రాలతో పోటీయా అనుకునేవారు. కానీ ఇప్పుడు దక్షిణాది ఫిలిం మేకర్స్‌ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రాలు భాషా హద్దులను చెరిపేస్తున్నాయి.

ఐతే, హిందీ సినిమాలు బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్స్‌కు కారణంగా ఏమిటని చూసినపుడు..సాధారణ ప్రేక్షకుడు కోరుకునే మాస్‌ మసాలాతో ఇతర కంటెంట్‌ గత కొన్నేళ్లుగా హిందీ సినిమాలో లోపించటమే అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాది (బాలీవుడ్‌) సినిమాక క్రమంగా మాస్‌ ప్రేక్షకులతో బంధం తెంచుకుంటోంది. కానీ, దక్షిణాది సినిమాలు ఇప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయల విలువలతో రూపొందుతున్నాయి. కానీ, హిందీ చిత్ర పరిశ్రమ పాశ్చాత్య సినిమాను అనుసరిస్తోంది. 90వ దశకం చివరి వరకు బాలీవుడ్‌లో సంగీత భరిత కుటుంబ కథా చిత్రాలు వచ్చాయి. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌ మేకర్స్‌కు పాశ్చాత్య సినిమాపై మోజు పెంచుకున్నారు. వారు బాలీవుడ్‌ను హాలీవుడ్‌గా చూడాలనుకున్నారు. తెచ్చిపెట్టుకున్న పాశ్చాత్యీకరణతో అది భారతీయ సంస్కృతిని కోల్పోయింది. కానీ, దక్షిణాది వారు తమ సంస్కృతి, ఆచారాల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తారు. అందుకే సౌత్‌ సినిమాలు కథా వస్తువు చుట్టూనే తిరుగుతాయి. అందుకే వాటిని ప్రజలు చూస్తున్నారు.. అవి సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.

బాలీవుడ్‌ సినిమాలో సాంప్రదాయ కంటెంట్‌ లోపించటం వల్ల క్రమంగా సామాన్య ప్రజానికానికి హిందీ సినిమాలు దూరమవుతున్నాయి. కేజీఎఫ్‌, బాహుబలి వంటి ఫిక్షన్‌ సినిమాలు విపరీతమైన ప్రజాదరణ పొందటానికి కారణం కూడా ఇదే. వీటిలో యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. సామాన్య జన హృదయాలను కట్టిపడేసేందుకు ఈ రెండు చాలు. ఈ కంటెంట్ లేనంత వరకు ఏ సినిమా సూపర్‌ హిట్‌ కాలేదు.

పుష్ప చిత్రంలోని “తగ్గేదేలే” డైలాగ్‌ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించింది. ప్రేక్షకులపై ఈ స్థాయి ముద్రవేసిన చిత్రం ఇటీవల కాలంలో మరొకటి లేదనే చెప్పాలి. ఆ మధ్య బాహుబలి కట్టప్ప గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్ 2 దేశ విదేశాల్లో కాసుల పంట పండిస్తోంది. తాజాగా మహేష్‌ బాబు “సర్కార్‌ వారి పాట” బాక్సాఫీస్‌ రిపోర్ట్స్‌ పాజిటివ్‌గా వస్తున్నాయి. దాంతో టాలీవుడ్‌ ఖాతాలో మరో భారీ హిట్‌ చేరినట్టయింది. రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు దక్షిణాది సినిమాలంటే బాలివుడ్‌కు చిన్న చూపు. కమల్‌ హసన్‌, చిరంజీవి, రజనీకాంత్‌ వంటి నటులు సూపర్‌ హిట్స్‌ ఇచ్చినా పూర్తి స్థాయిలో ఉత్తరాధి ప్రేక్షకుల ఆరణకు పొందలేకపోయారు. కానీ హీరోయిన్లను మాత్రం చాలా ఆదరించారు. వైజయంతి మాల, హేమామాలి, రేఖ, శ్రీదేవి, జయప్రద వంటి వారు బాలీవుడ్‌ను ఏలారు. అయితే ఇప్పడు పరిస్థితి తారుమారైందనిపిస్తోంది. దక్షిణాది సినిమాల్లో ఎక్కువగా ఉత్తరాది అమ్మాయిలు కనిపిస్తున్నారు. దక్షిణాది హీరోలు ఉత్తరాదిలో వసూళ్ల మోత మోగిస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసిన కొత్త పరిణామం ఇది.

దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడటం వల్ల ఆ భాషా చిత్రాలకు కొంత సహజ ప్రయోజనం చేకూరుతుంది. ఐతే, ఇప్పుడు డిజిటల్‌ యుగంలో అన్ని భాషా చిత్రాలు హిందీ సహా ప్రధాన భాషలన్నిటీలోకి డబ్‌ అవుతున్నాయి. ఇంట్లో కూర్చుని అన్ని భాషల హీరోల సినిమాలను చూసే అవకాశం లభించింది. అలా దేశంలోని అన్ని ప్రాంతాలకు అందరు హీరోలు పరిచయం అవుతున్నారు. దాంతో దక్షిణాది తారల హీరోయిజాన్ని ఉత్తరాది గుర్తించటానికి అవకాశం ఏర్పడింది. ఇదే వారిని పాన్‌ ఇండియా హీరోలుగా చేసిందని చెప్పవచ్చు. నేడు దక్షిణాది చిత్రాలు నాణ్యతా పరంగా, బడ్జెట్‌ పరంగా బాలివుడ్‌ సినిమాలకు సవాలు విసురుతున్నాయి. సవాలు విసరటమే కాదు వాటిని మించి సక్సెస్‌ సాధిస్తున్నాయి.

దేశ, విదేశీ ప్రేక్షకులను ఆకర్షించే పాన్-ఇండియా చిత్రాలను రూపొందించే కళలో దక్షిణాది ఫిలిం మేకర్స్‌ ఇప్పుడు సిద్ధహస్తులయ్యారు. సల్మాన్‌ ఖాన్ వంటి సూపర్‌స్టార్లు కూడా దక్షిణాది వారి సత్తాను గుర్తించారు. వారి హీరోయిజమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందంటారాయన. ఒంటి చేత్తో రైళును ఆపేయటం..తొడకొడితే భూమి దద్దరిల్లటం .. జీపును తన్నితే గాల్లో ఎగిరే ఎంటర్‌టెయిన్‌మెంట్‌ను ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. గతంలో హిందీ చిత్రాల్లోనూ ఈ హీరోయిజం కనిపించేది. కానీ కొన్నేళ్లుగా బాలీవుడ్‌ సినిమాల్లో అది లోపించింది. ఫలితంగా సామాన్య ప్రేక్షకుడు, బాలీవుడ్‌ చిత్రాల మధ్య అంతరం పెరుగుతోంది. అందుకే, భారీ అంచనాలతో రూపొందించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద చతకిలపడుతున్నాయి.

2019 వరకు దేశీయ బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్ వాటా దక్షిణ భారత చిత్రాల కంటే ఎక్కువగా ఉండేది . 2019లో బాలీవుడ్‌ చిత్రాలు రూ. 5,200 కోట్లు వసూలు చేయగా దక్షిణ భారత చిత్రాలు రూ. 4,000 కోట్లు కలెక్ట్ చేశాయి. ఐతే, 2021లో దక్షిణ భారత సినిమాలు దేశీయంగా 2,400 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆధిపత్య స్థానం పొందాయి. బాలీవుడ్ సాధించింది అందులో మూడవ వంతు మాత్రమే…అంటే రూ. 800 కోట్లు కలెక్ట్‌ చేసింది.

మరోవైపు, ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల పరిస్థితి అన్ని ప్రాంతీయ భాషా సినిమాల కన్నా మెరుగ్గా ఉంది. 2020, 2021 లెక్కల ప్రకారం బాక్సాఫీస్ వసూళ్లలో తెలుగు సినిమా వాటా 29 శాతానికి పెరిగింది, ఇదే సమయంలో హిందీ సినిమా 27 శాతం, తమిళ సినిమా వాటా 17 శాతంగా ఉంది. అయితే, ఈ సందర్భంగాలో కోవిడ్‌ -19 ప్రభావం గురించి కూడా చెప్పాల్సి వుంటుంది. మహమ్మారి కారణంగా అన్ని రంగాల మాదిరిగానే సినీ రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది.అయితే ఇది అన్ని భాషల సినీ పరిశ్రమలకు వర్తిస్తుంది. కనుక, దక్షిణాది సినిమా విజయానికి గల ప్రత్యేక కారణాలేమిటి అనేది చూడటమే ఇక్కడ ముఖ్యం.

విడుదలైన పది రోజుల వ్యవధిలో కేజీఎఫ్‌ 2 హిందీ డబ్బింగ్ వెర్షన్ 300 కోట్ల రూపాయల మార్క్‌ దాటింది. ఇప్పుడు నాల్గవ వారంలో కూడా రోజుకు రెండు కోట్లు రాబడుతోంది. మొత్తం మీద హిందీలో ఈ చిత్రం వసూళ్లు రూ. 420 కోట్లకు చేరింది. ఇది దక్షిణాది సినిమా కంటెంట్‌ పరంగా, మార్కెటింగ్‌ పరంగా సాధించిన పురోగతికి ఈ వసూళ్లు నిదర్శనం.

కోవిడ్-19 నిబంధల నుంచి బయటపడిన తరువాత సాధారణ ప్రేక్షకుడు భారీ, యాక్షన్‌ చిత్రాలను కోరుకుంటున్నాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమ ప్రేక్షకుని అవసరాన్ని అర్థం చేసుకుంది. దక్షిణాది హిట్ సినిమాలన్నీ ఈ ఫార్ములాపైనే ఆధారపడి రూపొందుతున్నాయి. పెద్ద స్టార్లు, పెద్ద దర్శకులు, డ్రామా, యాక్షన్‌ల కలయికతో వచ్చే సినిమాలు ప్రజాభిమానం చూరగొంటున్నాయి. 2022లో కూడా దక్షిణ భారత సినిమాలు బాలీవుడ్ చిత్రాల కంటే మెరుగైన వ్యాపారం చేస్తాయని నివేదికలు చెబుతున్నాయి.

అయితే బాలీవుడ్‌పై దక్షిణాది ఆదిపత్యం తాత్కాలికమేనా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. రాబోవు రోజులలో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేయగల 18 నుంచి 20 హిందీ చిత్రాలు లైన్‌ లో ఉన్నాయి. 2023 చివరి నాటికి ఈ చిత్రాలఅఉ విడుదలవుతాయి. సాధారణంగా ఒక ఏడాదిలో వచ్చే హిందీ చిత్రాల కంటే ఇది రెట్టింపు. వీటి ద్వారా వచ్చే బాక్సాఫీస్ ఆదాయంతో బాలీవుడ్‌ తిరిగి 45-50 శాతం వాటాను పొందే అవకాశం ఉంది. ఇదే సమంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ కొత్తగా వచ్చిన తన బాక్సాఫీస్‌ అధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడాల్సి వుంటుంది.

Exit mobile version