Site icon NTV Telugu

ఒకరికి ఆలస్యం అమృతం..మరొకరికి విషయం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వీలైనంత ఆలస్యంగా జరగాలని టీఆర్‌ఎస్‌ కోరుకుంటోంది. మరోవైపు, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఈ ఎన్నికలు వీలైనంత తొందరగా జరగాలని కోరుకుంటోంది. అవి ఎందుకు అలా బావిస్తున్నాయనటానికి స్పష్టమైన కారణాలున్నాయి. ఉప ఎన్నిక ఆలస్యమైతే ఉచిత పథకాలు ..స్కీములు ఎక్కువ మంది ఓటర్లకు చేరుతాయి. ఇది టీఆర్‌ఎస్‌ ఆలోచన. ఈటలకు ఉన్న సింపథీ ఫ్యాక్టర్ చల్లారుతుంది. ఇది బీజేపీ భయం. అలా జరగకముందే వీలైనంత త్వరగా ఎన్నికలు జరిగేలా చూడటానికి బీజేపీ తన వంతు ప్రయత్నం చేస్తోంది.

జూన్‌ 1న ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ రాజీనామా చేశాకు. అప్పటి నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఎదురుచూస్తోంది. రాజీనామా తరువాత ఈటల బీజేపీలో చేరారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దాదాపు ఈటలే ఖాయం. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా ఈటల, టీఆర్‌ఎస్‌ ఉదృతంగా క్యాంపెయిన్‌ చేస్తున్నారు. అయితే మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ ఊసే లేదు.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రచారం ప్రస్తుతం అంతంత మాత్రమే. వాల్‌రైటింగ్స్‌, బ్యానర్లు, కొన్ని ర్యాలీలకే పరిమితమైంది హస్తం పార్టీ. దాంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అభ్యర్థిని ఎంత ఆలస్యంగా ప్రకటిస్తే అంత నష్టమని స్థానిక నాయకులు అధిష్టానికి ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ప్రచారంలో చాలా ముందున్నాయని , ఇక ఎంత మాత్రం ఆలస్యం పనికిరాదని అధిష్టానికి చెప్పామని కరీంనగర్‌ జిల్లా నేతలు అంటున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పి.కౌశిక్ రెడ్డికి 60 వేల ఓట్లు వచ్చాయి. అయితే ఆయన ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ గా ఆయన పేరును రాష్ట్ర క్యాబినెట్‌ రికమండ్ చేసింది. గవర్నర్‌ కార్యాలయంలో అది పెండింగ్‌లో ఉంది.

కాంగ్రెస్‌ పెద్దలు ఈ శనివారం సమావేశమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించాలా..లేదంటే ఎన్నికల తేదీ ప్రకటించే వరకు వెయిట్‌ చేయాలా అనేదానిపై ఈ సమావేశంలో క్లారిటీ వస్తుంది. దసరా తరువాత నోటిఫికేషన్‌ వస్తుందని, దీపావళి తరువాత ఎన్నికలు అన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌ లో టాక్‌.

హుజూరాబాద్ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మరో దుబ్బాక కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే దుబ్బాకలో కూడా ప్రచార బాధ్యతలు హరీష్‌ రావే తీసుకున్నారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా ఆయనే మంత్రాంగం నడుపుతున్నారు. అక్కడే మకాం వేసి కథ నడుపుతున్నారు. ఈటెలకు చెక్‌ పెట్టేందుకు అన్ని వర్గాల వారితో సమావేశాలు జరుపుతున్నారు. తెరవెనక మంత్రాంగంతో ఈటల అనుచరులను సైతం పార్టీలోకి లాగేసుకునేందుకు భారీ స్కెచ్‌లు వేస్తున్నారు. దాంతో పాటు హామీల అమలు బాధ్యత కూడా తనదే అంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇక కేసీఆర్ నిధుల ప్రవాహం ఎలాగూ ఉండనే ఉంటుంది. మరి వీటిని తట్టుకుని ఈటల ఎలా విజయం సాధిస్తారా అన్నది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.

Exit mobile version