NTV Telugu Site icon

విజయగర్వంతో ఇంటికి !

రాత్రికి రాత్రి మొక్క పెరిగి పెద్ద కాదు. అందుకు సమయం పడుతుంది. అలాగే, పంట పండించడానికి సహనం కావాలి. ముందు భూమిని దున్నాలి. తరువాత విత్తనాలు చల్లాలి. అవి మొలకెత్తి పెరుగుతున్నపుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే, చైతన్యం, ఆశ, భయం, నమ్మకం, అప్రమత్తత వీటన్నిటి కలయికే వ్యవసాయం. ఉద్యమంలో భాగంగా రైతులు చేసింది కూడా ఒక విధమైన వ్యవసాయమే.

2020 నవంబర్‌ 26న పంజాబ్‌ రైతులు ఇళ్లు విడిచి ఢిల్లీ వెళ్లారు. రాజధాని సరిహద్దుల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. నిరసనల అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఖలిస్తానీలని, మావోయిస్టులని, చైనా నుంచి నిధులు వస్తున్నాయని ప్రభుత్వ అనుకూల మీడియా చేయని ప్రచారం లేదు. ఐనా, రైతు లోకం చలించలేదు. ఇక, రిపబ్లిక్‌ డే పరిణామాలు కుట్రలకు పరాకాష్ట. ఎర్రకోట సాక్షిగా ప్రభుత్వ బలగాలు హింసకు దిగింది. ఉద్యమాన్ని విచ్చిన్నం చేయాలని ప్రయత్నించింది. కానీ కర్షకలోకం సంయమనం కోల్పోలేదు. ఉద్యమాన్ని చేజారనీయలేదు.

భాష్పవాయు ప్రయోగించారు, లాఠీఛార్జీలు జరిగాయి. విచ్చలవిడిగా అరెస్టులు.. రైతు నాయకులతో పాటు జర్నలిస్టుల పైనా కేసులు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు రైతే గెలిచాడు. నిజానికి, ఈ ఉద్యమంలో విజయం సాధిస్తామని రైతులకు మొదటి నుంచి నమ్మకం. ఎందుకంటే వ్యవసాయం కూడా నమ్మకమే కాబట్టి. సాగు చేయటం అంటే ఆశతో ముందుకు సాగటమే కాబట్టి. విత్తు నాటిన క్షణం నుంచి పంట చేతికి అందే వరకు నిరీక్షించాలి. అదొక గొప్ప నిరీక్షణ. గెలుస్తామన్న ఆశతో కూడిన ఎదురుచూపు. వాస్తవం చెప్పాలంటే, ఈ పోరాటంలో విజయం సాధిస్తారని వారు తప్ప ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే అది మోడీ సర్కార్‌ మీద యుద్దం కనుక. ఐతే, పట్టదులతో సహనంతో కొట్లాడితే ఎంతటి ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని కర్షకలోకం మరోమారు నిరూపించింది.

ఇటీవల కాలంలోలక్షలాది మంది ఇంత సుదీర్ఘ కాలం సాగించిన ప్రజా పోరాటం మరొకటి లేదు. అంతర్జాతీయ సమాజం కూడా వీరికి మద్దతు తెలిపింది. చరిత్రలో ఇదొక గొప్ప పోరాటంగా నిలిచిపోతుందనటంలో ఎలాంటా సందేహం లేదు.

మరోవైపు, ఈ పోరాటంలో మహిళల భాగస్వామ్యం చాలా గొప్పది. పురుషులకు తీసిపోని విధంగా పోరాట పటిమ ప్రదర్శించారు. ఉద్యమానికి తమ వంతు సహకరించారు. నిరసనలు ఎగిసిన సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌ పూర్‌, పల్వల్‌ లోఏడాది పాటు కష్టనష్టాలను తట్టుకొని ఉద్యమం వెన్నంటి ఉన్నారు. కొందరు మహిళలు పిల్లలతో సహా వచ్చి ఉద్యంలో పాల్గొన్నారు. తమ భూమి, తమ పిల్లల భవిష్యత్తు కోసం తెగించి ఉద్యమించారు. పంజాబ్‌లోని ఆరు వందల గ్రామాల నుంచి పాతిక వేలకు పైగా మహిళలు ఈ మహా రైతు ఉద్యమంలో పాల్పంచుకున్నారు.

2020 నవంబర్‌ 26న ఢిల్లీ ప్రదర్శనకు అవసరమైన ఆహారం, ఇతర వస్తువులను మహిళలే సమీకరించారు. 2020 నవంబర్‌ 27న పంజాబ్‌ మహిళలు పోలీస్‌ బారికేడ్లను నెట్టుకుని హర్యానాలో అడుగుపెట్టారు. పెద్ద సంఖ్యలో తరలిన మహిళలను చూసి జనం ఆశ్చర్యపోయారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో హర్యానా మహిళలు సింఘు, టిక్రీ ప్రాంతాల్లోని నిరసనల్లో పాల్గొన్నారు. హర్యానా మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి రైతు ఉద్యమంలో పాల్గొనటం నిజంగా విశేషమే. కొందరు మహిళలు తమ భర్త, కుమారులను ఉద్యమానికి పంపి తాము వ్యవసాయం, ఇంటి బాధ్యతలు చూసారు.

మోడీ ప్రభుత్వ ఏకపక్షంగా తెచ్చిన సాగుచట్టాలను రద్దు చేయటంతో పాటు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఈ ఆందోళనలకు తలొగ్గి సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటిరోజే చట్టాలరద్దు బిల్లును ఆమోదించింది. ఎంఎ‍స్‌పి చట్టబద్ధతపై చర్చించేందుకు ఓ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో కిసాన్ మోర్చాకు చెందిన వారు కూడా సభ్యులుగా ఉంటారు. అలాగే ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌ లోనే 45 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సంవత్సర కాలంపాటు జరిగిన సుదీర్ఘ రైతు ఉద్యమం కోట్లాది జీవితాలపై ప్రభావం చూపింది. ప్రజాస్వామ్యంలో ఈ విజయం భిన్నమైనది. భారతీయ ప్రజాపోరాటాల చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది!!