తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ గేమ్ రసవత్తరంగా నడుస్తోంది. జనం దృష్టిలో వీరు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారనేది బహిరంగం రహస్యం. బహుశా అందుకే కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరచూ వీరిది మ్యాచ్ ఫిక్సింగ్ బంధమని ఎగతాళి చేస్తుంటుంది. రహస్య స్నేహితులని ఆరోపిస్తుంటుంది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు అంశంపై రెండు పార్టీలు చేస్తున్న హంగామా కూడా అలాంటిదేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
ఖరీఫ్ బియ్యాన్ని పూర్తిగా కొనాలని ఎఫ్‌సీఐని ఆదేశించని కారణంగా కేంద్రంపై టీఆర్‌ఎస్ యుద్ధం ప్రకటించింది. అలాగే, బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేనందున వచ్చే రబీలో దానిని కొనే ప్రశ్నే లేదని కేంద్రం స్ఫష్టం చేయటం రెండు పార్టీల మధ్య యుద్ద నేపథ్యమైంది. క్రమంగా అది తారాస్థాయికి చేరుతోంది.
మరోవైపు, టీఆర్‌ఎస్ చేపట్టిన రైతు ఆందోళనలకు కౌంటర్‌గా సర్కార్‌ని టార్గెట్ చేస్తూ ఉద్యోగ నియామకాల కోసం ఆందోళన చేపట్టి టీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. గులాబీ పార్టీని గద్దె దించటమే లక్ష్యంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం కేసీఆర్ అవీనితి, అరాచకాలను బయటపెట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల కోరారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఐనా, ఈ రెండు పార్టీలది డ్రామా అనే అనుమానాలు ప్రజలలో తొలగిపోలేదు. వాటి మధ్యన ఏదో లోపాయికారి ఒప్పందం కుదిరిందనే సందేహాలు రాజకీయ వర్గాలలో ఇంకా సజీవంగా ఉన్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఎవరికైనా అలాంటి అనుమానాలు కలగటం సహజం.
గతంలో కేంద్రం తీసుకు వచ్చిన పలు వివాదాస్పద బిల్లులపై బీజేపీకి పార్లమెంటులో టీఆర్‌ఎస్ మద్దతుగా నిలిచింది. బహుశా వచ్చే సంవత్సరం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు అధికార పార్టీకి సంఖ్యాబలం తగ్గిన పక్షంలో మళ్లీ టీఆర్‌ఎస్ సాయం అవసరం కావచ్చు. ఎందుకంటే, యూపీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా కనీసం వంద సీట్లు తగ్గుతాయని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు, దాని ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అవకాశాలు రోజు రోజుకు మెరుగవుతున్నాయి. కాబట్టి, ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రాంతీయ పార్టీలతో బీజేపీ ఇప్పటికిప్పుడు అమీ తుమీకి దిగకపోవచ్చు. అందుకే ఇప్పుడు ఈ రెండు పార్టీల పంచాయితీ ఓ రాజకీయ అవసరంగానే ప్రజలకు కనిపిస్తోంది. అందులో నిజాయితీ ఉండకపోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ ఒకేసారి అధికారంలోకి వచ్చాయి. ఈ సంగతి అందరూ గుర్తించాలి. ఎందుకంటే ఇన్నేళ్లలో టీఆర్‌ఎస్ పాలనలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలకు సమాచారం ఉంటే కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇంతవరకు ఎందుకు దాడులు చేయలేదు? రాజకీయ ఉద్దేశాలతో చర్యలకు దిగిన చరిత్ర సీబీఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు ఉండనే ఉంది. ఇచ్చిపుచ్చుకునే దోరణి అవలంభించారు కనుక వాటి అవసరం రాలేదు అనే వాదన కూడా ఉంది. ఐతే, ఇప్పుడు బీజేపీకి ఆ అవసరం వచ్చిందా? ఒక వేళ వచ్చినా ఆ పని చేయగలదా?
వాస్తవానికి బీజేపీ టార్గెట్ టీఆర్‌ఎస్ కాదు..కాంగ్రెస్ అనేది జగమెరిగిన సత్యం. టీఆర్‌ఎస్ లక్ష్యం కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ని ఖతం చేయటమే. ఉమ్మడి శత్రువైన తమను రాష్ట్రంలో లేకుండా చేసేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్ సీక్రెట్‌గా కలిసి పనిచేస్తున్నాయన్న కాంగ్రెస్ వాదనకు ఇది బలం చేకూర్చుతుంది. కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి ప్రజల దృష్టిలో టిఆర్‌ఎస్‌కు తామే ప్రధాన ప్రత్యర్థిలా కనిపించాలన్నది బీజేపీ ఆరాటం. 2023లో కాకపోయినా ఆ తరువాత అయినా రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి అది మార్గం అవుతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్ట కట్ట కూడదని కేసీఆర్ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అయితే, రెండు పార్టీలు ఆడుతున్న ఈ ఆట అనుకున్నట్టు సాగుతోందా అన్నది ఇప్పుడు ప్రశ్న.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే టీఆర్‌ఎస్ వ్యూహం విఫలం అయిందా అనే సందేహం కూడా కలుగుతోంది. బీజీపీ బలం ఎంత పెరిగితే తనకు లాభం ..కాంగ్రెస్ ఎంత పతనమైతే తనకు మేలు అనే లెక్కల్లో కేసీఆర్ విఫలమయ్యారని రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. బీజేపీపై యుద్ధం ప్రకటించి ఆ పార్టీని ఉద్దేశపూర్వకంగానే పెద్దది చేశారని వారంటున్నారు. హుజురాబాద్ ఎన్నికల తరువాత బీజేపీ దూకుడు ఊహించినదే. కానీ కేసీఆర్ వరి యుద్ధంతో కేంద్రాన్ని ఇరకాటంలో పడేసి రాష్ట్ర నేతల దూకుడు తగ్గించాలనుకున్నారు. మరి అలా జరిగిందా? అంటే…తగ్గకపోగా మరింత పెరిగిందనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 2018 మాదిరిగా అసెంబ్లీని ఎప్పుడైనా రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చన్న అమిత్ షా మాటలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలకు సిద్ధం కావాలన్న పిలుపు ఉంది ఆయన మాటల్లో. ఐతే, గులాబీ దళపతి వాటిని కొట్టిపారేస్తున్నారు. విపక్షాలు ఆడుతున్న మైండ్ గేమ్ అని..వాటి జోలికి వెళ్లవద్దని పార్టీ నేతలను, కార్యకర్తలకు చెప్పినట్టు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ముందస్తు ఎన్నికలపై వాడి వేడి చర్చ నడుస్తోంది. టీఆర్‌ఎస్ వర్గాల్లో కూడా ఇదే చర్చనీయాంశం. దాంతో, క్యాడర్‌లో స్థైర్యం దెబ్బతినకుండా, ముఖ్యంగా ఎమ్మెల్యేలలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నారు. ప్రస్తుతం ఏ ఇద్దరు టీఆర్‌ఎస్ నేతలు కలిసినా ముందస్తు ఎన్నికల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని టాక్. ఈ నేపథ్యంలో, నాయకులు, పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు మైండ్ గేమ్‌లకు తెరతీశాయని గులాబీ పార్టీ నాయకత్వం తమ క్యాడర్‌కి వివరించే ప్రయత్నం చేస్తోంది.
2018 ఎన్నికల నాటి పెండింగ్ వాగ్దానాలు, ముఖ్యంగా లక్ష రూపాయల పంట రుణ మాఫీ, నెలకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతి, 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వంటి వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం ఫుల్ టర్మ్ పూర్తి చేస్తుందని నాయకత్వం పార్టీ శ్రేణులకు నమ్మకంగా చెప్పినట్టు తెలుస్తోంది. కోవిడ్ మహమ్మారి, వరుస ఎన్నికల దృష్ట్యా వాటిని అమలు చేయలేకపోయామని పార్టీ నాయకత్వం అంటోంది. అయితే, కేసీఆర్‌కు హామీలు ముఖ్యం కాదు..సరైన సమయం కోసం ఎదురుచూస్తారనే పేరుంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌తో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఏడాది ముందుగానే ఎన్నికలు జరగనున్నాయనే పోస్టులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ కనిపించాయి. వచ్చే ఎన్నికల్లో 50 శాతం మంది సిట్టింగ్‌లకు టికెట్ దక్కదనే వార్తలు కూడా కొంత కాలంగా ఇటు పార్టీ వర్గాలలో అటు మీడియాలో తెగ షికార్లు చేస్తున్నాయి. దాంతో, టీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి మద్దతుదారులలో తీవ్ర ఆందోళన నెలకొంది. టిక్కెట్ దక్కని వారి జాబితా కూడా సోషల్ మీడియా లో విస్తృతంగా చక్కర్లు కొట్టటం వారి భయాలను రెట్టింపు చేస్తోంది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డిలు చాలా రోజులుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఐతే, అమిత్ షా నోటి నుంచి ఈ మాట రావటం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కింది. దాంతో, ముందస్తు ఎన్నికలకు ఆస్కారం లేదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలకు హామీ ఇవ్వాల్సి వస్తోంది. వచ్చే రెండేళ్లు నిరంతరం జనం మధ్యనే ఉండి తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కేసీఆర్ కోరారు.
2023 ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత తనపై ఉందని రావు ఎమ్మెల్యేలకు చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. 2018 మాదిరిగా ఐదారుగురు మినహా మిగతా సిట్టింగ్‌లందరికి టికెట్ ఖాయం అని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. కానీ, పరిస్థితులను బట్టి రాజకీయం మారుతుంది. దాంతో పాటే నిర్ణయాలు కూడా మారుతాయన్నది రాజనీతి శాస్త్రం ప్రాథమిక సూత్రం!!
Dr.Ramesh Babu Bhonagiri
