Yellow Crazy Ants: చీమే కదా అని తక్కువ అంచనా వేయకండి. సైజులో చిన్నగా ఉన్నా చీమ కుడితే ఎంతటి ప్రాణి అయినా గిలగిల కొట్టుకోవాల్సిందే. చీమలు లక్షల సంఖ్యలో దండయాత్ర చేస్తే ప్రజలు వణికిపోవాల్సిందే. తమిళనాడులోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి గ్రామాలపై చీమలు దండెత్తాయి. గ్రామాల్లోకి చొచ్చుకొస్తున్న చీమల దండు కనిపించిన ప్రతి వస్తువును తినేస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కరంతమలై రిజర్వ్ ఫారెస్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎల్లో క్రేజీ యాంట్స్ అనే చీమలు విజృంభిస్తున్నాయి. దీంతో అక్కడ నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికంగా ఉండే చీమల పుట్టలను ఈ జాతి చీమలు ఆక్రమిస్తున్నాయి. అంతేకాకుండా కీటకాలు, పురుగులను తినేస్తున్నాయి. అక్కడి వరకు అయితే ఫర్వాలేదు. కానీ ఇంట్లో ఏ వస్తువు పెట్టినా వాటికి చీమలు పడుతున్నాయి. ఆయా ఆహార పదార్థాలను తినేస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని తినలేకపోతున్నారు. ప్రస్తుతం దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోని సుమారు ఏడు గ్రామాలపై చీమలు దండయాత్ర చేస్తున్నాయి. పంట పొలాలను సైతం నాశనం చేస్తున్నాయి. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లను సైతం వదలిపెట్టడం లేదు. పాములు, బల్లులను గుంపులుగా చుట్టుముట్టి చీమలు అవలీలగా స్వాహా చేస్తున్నాయి. చీమల కారణంగా కొన్ని పశువులు చనిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మేకలు, పశువులు కంటి చూపును కోల్పోతున్నాయని వాపోతున్నారు.
Read Also: Rejinthal Ganapathi Pooja: రేజింతల్ గణపతి.. సమ్ థింగ్ స్పెషల్
సాధారణంగా ఇలాంటి చీమలు ఆసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 4-5 మి.మీ. వరకు పొడవు ఉండే ఈ చీమలకు పొడవైన కాళ్లు, తల మీద పొడవైన యాంటెన్నా లాంటివి ఉంటాయి. పసుపువన్నెలో ముదురు గోధుమ రంగులో ఉండే ఈ చీమలు 80 రోజుల వరకు జీవించగలుగుతాయి.అయితే ఎల్లో క్రేజీ యాంట్స్ జాతికి చెందిన చీమలు కుట్టవు. కానీ పొత్తికడుపు కొన దగ్గర ఉండే ఒక చిన్న గొట్టం ద్వారా భయంకరమైన ఫార్మిక్ యాసిడ్‌తో కూడిన ద్రవాన్ని శ్రవిస్తాయి. ఆ యాసిడ్ శ్రవించిన చోట విపరీతమైన దురద, సొరియాసిస్ మాదిరిగా చర్మం పొట్టులా రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ద్రవం పశువులు, మానవుల కంట్లో పడితే చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ చీమలపై చీమల మందు చల్లుతున్నా ఉపయోగం ఉండటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలోని తొలి 100 ప్రమాదకర జాతుల్లో ఈ జాతి చీమలు ఉన్నట్లు వన్యప్రాణి పరిశోధకురాలు అశోక చక్రవర్తి వివరించారు.
