Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్‌ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)

  • ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో జరిగిన ఒక భయానక ఘటన
  • మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే
  • పారాచూట్‌ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం
Plane Crashes Into Paraglid

Plane Crashes Into Paraglid

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక షాకింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో జరిగిన ఒక భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రశాంతంగా గాల్లో విహరిస్తున్న ఒక మహిళా పారాగ్లైడర్‌ను అకస్మాత్తుగా ఓ చిన్న విమానం ఢీకొనడంతో గాల్లోనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో పారాగ్లైడర్ పారాచూట్ పూర్తిగా చీలిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఉత్తర ఆస్ట్రియాలోని ష్మిట్టెన్‌హోహే పర్వత శ్రేణి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, 44 ఏళ్ల సబ్రినా అనే మహిళ శనివారం మధ్యాహ్నం పారాగ్లైడింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా ఆమెకు అత్యంత సమీపంలో ఓ చిన్న విమానం ప్రత్యక్షమైంది. క్షణాల్లోనే ఆ విమానం పారాగ్లైడర్ రెక్కను ఢీకొట్టింది.

గాల్లో అదుపుతప్పిన పారాగ్లైడర్

ఫస్ట్ పర్సన్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలో, విమానం వేగంగా వచ్చి పారాగ్లైడర్ పైభాగాన్ని ఢీకొట్టడం కనిపిస్తుంది. ఆ ఢీకొట్టిన ప్రభావంతో పారాగ్లైడర్ రెక్క చీలిపోవడంతో సబ్రినా గాల్లో గిరగిరా తిరుగుతూ కిందకు పడిపోవడం ప్రారంభమైంది. చిరిగిన పారాచూట్ వస్త్రాలు ఆమె చుట్టూ చిక్కుకోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.

అయితే ఆ సమయంలో కూడా సబ్రినా ధైర్యం కోల్పోలేదు. తీవ్ర భయాందోళనల మధ్య కూడా ఆమె అప్రమత్తంగా వ్యవహరించింది. చివరి క్షణాల్లో అత్యవసర బ్యాకప్ పారాచూట్‌ను విజయవంతంగా తెరిచి తన ప్రాణాలను రక్షించుకుంది.

స్వల్ప గాయాలతో బయటపడ్డ సబ్రినా

ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ, సబ్రినాకు కేవలం స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఇప్పటికీ నేను బతికే ఉన్నానని నమ్మలేకపోతున్నాను” అని పేర్కొంది. నివేదికల ప్రకారం, కొండ వాలుపై పడిపోవడానికి క్షణాల ముందే ఆమె బ్యాకప్ పారాచూట్‌ను తెరిచింది. అనంతరం పోలీసు హెలికాప్టర్ సహాయంతో ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

పైలట్ వివరణ ఇదే

ఇక విమానాన్ని నడిపిన 28 ఏళ్ల పైలట్, ప్రమాదం తర్వాత విమానాన్ని జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానానికి స్వల్ప నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పైలట్ వివరణ ప్రకారం, పారాగ్లైడర్ అకస్మాత్తుగా తన ముందుకు రావడంతో ఢీకొట్టడాన్ని తప్పించుకునే అవకాశం తనకు దొరకలేదని తెలిపాడు.