అప్పుడప్పుడు జీవితంలో మనం ఊహించని అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఆ అద్భుతాలు మన కళ్ల ముందు జరిగితే నోరెళ్లబెట్టడం తప్ప ఏమీ చేయలేం. అయితే దేవుడి సన్నిధిలో వింత జరిగితే అది మహాద్భుతమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మేక ప్రతిరోజూ ఆలయానికి వచ్చి గంట మోగిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లాలోని కలక్కాడ్ గ్రామం తొప్పు వీధిలో ఉండే అరుల్మిగు అంగాలా పరమేశ్వరీ ఆలయానికి కొంతకాలంగా ప్రతిరోజూ ఓ మేక వస్తోంది. ఆలయానికి మేక రావడమే కాకుండా ప్రతిరోజూ సుమారు 10 నిమిషాల పాటు ఏకధాటిగా గంట మోగిస్తోంది. ప్రతిరోజూ సదరు ఆలయానికి చేరుకుంటున్న మేక గంట నుంచి స్తంభానికి కట్టిన తాడును తన కొమ్ములతో ఆడిస్తూ మోగిస్తోంది. మేక చేస్తున్న పనిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
