టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఫ్రాడ్ చేస్తూ అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఈజీమనికి అలవాటు పడి సరికొత్త ఎత్తుగడలతో మోసం చేస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే విషయం దీనికి భిన్నం. చోరీలు ఎలా చెయ్యాలో తెలుసుకోవడానికి ఏకంగా యూట్యూబ్ వాడేశాడు. యూట్యూబ్ సాయంతో దొంగతనాలకు తెరలేపాడు ఓ ఘనుడు. చివరికి పోలీసుల ఎంట్రీతో అతని చోరీలు బయటపడ్డాయి. చివరికి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన కొట్టి సాయిరాం అనే యువకుడు నెల క్రితం హైదరాబాద్ కు వచ్చి కేపీహెచ్ బీలో మకాం పెట్టాడు. హాస్టల్ లో ఉంటూ ప్రశాంత్ నగర్ లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం సరిపోవడం లేదని దొంగతనాలు చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో జనవరి 3న బాలాజీ నగర్ లో ఓ బైక్ ను చోరీ చేశాడు. ఆ తర్వాత ఓ యువతి మెడలోంచి 8 తులాల గోల్డ్ చైన్ చోరీ చేశాడు. కాగా బాధితురాలు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందు రోజు మోహన్ అనే యువకుడు తన బైక్ పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 5 బృందాలుగా రంగంలోకి దిగారు. చోరీలకు పాల్పడుతున్న దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో దొంగను గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కొట్టిసాయిరాం గొలుసు దొంగతనమే కాదు.. బైక్ చోరీ కూడా ఇతనే చేశాడని పోలీసులు నిర్థారించారు. అతడి వద్ద నుంచి బైక్, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో కొట్టి సాయిరాం చేసిన దొంగతనాలు మరిన్ని వెలుగుచూశాయి.
ఇతనిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం పీఎస్ లో 3 బైక్ లు, ట్రాక్టర్ టైర్ల దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతు హైదరాబాద్ కు మకాం మార్చాడు. దొంగ ఎప్పటికైనా పోలీసులకు చిక్కాల్సిందే కదా. హైదరాబాద్ లో చోరీలకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొట్టి సాయిరాం దొంగతనాలు చేసేందుకు యూట్యూబ్ సాయం తీసుకున్నాడు. చోరీలు ఎలా చెయ్యాలి అనే వివరాలను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నట్లు పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇది తెలిసిన నెటిజన్లు నీ తెలివి తగలెయ్య.. అందరు క్రియేటివ్ కంటెంట్ తో యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేస్తుంటే.. నువ్వు మాత్రం చోరీలు చేయడానికి యూట్యూబ్ ను వాడుతున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు.