Senior Army Officer Assaults SpiceJet Staff: శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్‌జెట్ విమానం SG-386 బోర్డింగ్ గేట్ వద్ద ఒక సీనియర్ ఆర్మీ అధికారి నలుగురు స్పైస్‌జెట్ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలై 26న అదనపు క్యాబిన్ బ్యాగేజీని తీసుకెళ్లడానికి ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించమని సిబ్బందికి కోరగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది కథనం ప్రకారం.. ఆ ఆర్మీ అధికారి వద్ద మొత్తం 16 కిలోల బరువున్న రెండు క్యాబిన్ బ్యాగులు ఉన్నాయి. వాస్తవానికి లగేజీ గరిష్ట పరిమితి 7 కిలోలు మాత్రమేనని స్పైస్‌జెట్ తెలిపింది. సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆ నిబంధన గురించి అతనికి తెలియజేసి ఛార్జీ చెల్లించమని కోరారు. అయితే ఆ అధికారి ఛార్జీలు చెల్లించేందుకు నిరాకరించి, బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయకుండానే ఏరోబ్రిడ్జిలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఇది పౌర విమానయాన భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పైస్‌జెట్ తెలిపింది. దీంతో అక్కడే ఉన్న CISF అధికారులు అతన్ని గేటు వద్దకు తీసుకెళ్లారు.
READ MORE: Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ అల్లరి..
దీంతో ఆగ్రహానికి గురైన ఆయన నలుగురు గ్రౌండ్ స్టాఫ్‌పై దాడి చేశారు. ఒక ఉద్యోగిని పిడిగుద్దులు, తన్నడంతో పాటు స్టీల్ స్టాండ్‌తో అనేకసార్లు కొట్టారు. ఆ ఉద్యోగి వెన్నెముక విరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆ ఉద్యోగి తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోవడంతో సహోద్యోగికి సహాయం చేయడానికి వచ్చాడు. అతడి దవడపై బలంగా తన్నడంతో ముక్కు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన ఉద్యోగులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించి పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విమానయాన సంస్థ ప్రయాణీకుడిని నో-ఫ్లై జాబితాలో చేర్చే ప్రక్రియను ప్రారంభించిందని, ఇది పౌర విమానయాన నిబంధనల ప్రకారం తీసుకుంటున్న చర్య అని స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. ఈ తీవ్రమైన దాడి గురించి స్పైస్‌జెట్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసింది. ప్రయాణీకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా.. విమానాశ్రయ అధికారుల నుంచి అందుకున్న CCTV ఫుటేజ్‌ను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
— Liberal Monk (@liberal_monk) August 3, 2025
