ఉదయం లేవగానే అందరికీ టీ తాగడం అలవాటు. సాధారణంగా టీ ధర రూ.10 లేదా రూ.20 ఉంటుంది. పెద్ద రెస్టారెంట్లు, కాఫీ షాపుల్లో అయితే టీ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇళ్లలో వాడుకునే టీ పొడి కిలో సుమారుగా రూ.300 ఉంటుంది. కానీ అసోంలో లభించే పభోజన్ గోల్డ్ టీ ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు. తాజాగా అసోంలో లభించే పభోజన్ గోల్డ్ టీ పొడిని వేలం వేయగా మంచి ధర దక్కింది. జోర్హాట్‌లో జరిగిన ఈ వేలంలో పభోజన్ టీ పొడి ధర కిలోకు రూ.లక్ష వరకు పలికింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా వ్యాపారులు చెబుతున్నారు.
గోలఘాట్ జిల్లాలో పభోజన్ బ్రాండ్‌కు చెందిన సేంద్రీయ టీ ఉత్పత్తి అవుతోంది. పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ నుంచి అసోంకు చెందిన ‘ఎసా టీ’ ఈ టీ పొడిని కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఈ టీ పొడికి మంచి డిమాండ్ ఉందంట. పభోజన్ గోల్డ్ టీ ఇతర టీల కంటే రుచిగా, ప్రత్యేకంగా ఉంటుందంట. ఒక్కసారి ఈ టీ తాగితే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుందని అక్కడివారు చెబుతున్నారు. దీనిని ఇష్టపడే వారు అంతర్జాతీయంగా చాలామంది ఉన్నారని.. అందుకే ఈ టీ పొడిని టీ బ్రాండ్ ‘ఎసా టీ’ సంస్థ కొనుగోలు చేసింది. మరోవైపు అసోంలో తేయాకు ఎక్కువగా సాగవుతుంది. ఇక్కడే పండే తేయాతో పలు రకాల టీ పొడులను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు.
దీంతో పభోజన్ టీ పొడికి పలికిన ధరను చూసి స్థానికులే అవాక్కవుతున్నారు.
