Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్‌షీట్’ సెలబ్రేషన్!

  • మార్కులు తక్కువని తిట్టలేదు..
  • కేక్ కోసి పండగ చేశారు
  • వైరల్ అవుతున్న ‘55 శాతం’ మార్క్‌షీట్ సెలబ్రేషన్
Mumbai Family

Mumbai Family

Marksheet Cake: ముంబైకి చెందిన ఒక కుటుంబం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సాధారణ కుటుంబం లాగా కాకుండా ఈ ఫ్యామిలీ భిన్నంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి విద్యా వ్యవస్థలోని ఒత్తిడికి, మార్కుల వేటకు భిన్నంగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ కుమారుడికి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా, ఆ అబ్బాయి సాధించిన విజయాన్ని ఆ కుటుంబం ఘనంగా వేడుక చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

మార్క్‌షీట్ కేక్‌తో సర్ప్రైజ్..
ముంబైకి చెందిన మహమ్మద్ జైద్ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో 55 శాతం మార్కులు సాధించాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కోప్పడటం లేదా మిగతా వాళ్లతో పోల్చి తిట్టడం లాంటివి చూస్తుంటాం. కానీ జైద్ కుటుంబం మాత్రం అతని మార్క్‌షీట్‌నే ఒక కేక్‌గా తయారు చేయించి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ కేక్‌పై జైద్ పేరు, రూల్ నంబర్, అతను ప్రతి సబ్జెక్టులో సాధించిన మార్కులను కూడా ముద్రించారు. జైద్ ఇంటికి రాగానే కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ అతనికి ఘనస్వాగతం పలికారు. తన మార్క్‌షీట్ థీమ్ కేక్‌ను చూసి ఆశ్చర్యపోయిన జైద్, చిరునవ్వుతో దానిని కట్ చేశాడు. ఈ సంబరాలకు సంబంధించిన వీడియోను జైద్ సోదరి రుక్సర్ పటేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గొప్ప మనసు చాటుకున్న తల్లిదండ్రులు
ఈ వేడుకపై రుక్సర్ పటేల్ స్పందిస్తూ.. హృదయానికి హత్తుకునే మాటలు చెప్పారు. “నా దృష్టిలో మా తమ్ముడికి వచ్చిన 55 మార్కులు.. 95 మార్కుల కంటే ఎక్కువే. మార్కుల కోసం పిల్లలను తిట్టడం లేదా బాధపెట్టడం వల్ల వారు మానసికంగా కుంగిపోతారు. వాడు ఎప్పుడూ ఇతరుల కంటే తక్కువ అని భావించకూడదనే మేము ఇలా సెలబ్రేట్ చేశాం. ఒత్తిడి వల్ల పిల్లలను కోల్పోతున్న తల్లిదండ్రులను చూస్తుంటే బాధేస్తుంది, అందుకే మా ఇంట్లో సంతోషానికి ప్రాధాన్యత ఇచ్చాం” అని ఆమె రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నేను 95 శాతం మార్కులు సాధించినా నాకు ఇలాంటి గౌరవం లభించలేదు.. ఈ కుటుంబం నిజంగా గ్రేట్” అని ఒకరు కామెంట్ చేయగా, “ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఉండాలి. పిల్లల మానసిక ఆరోగ్యం మార్కుల కంటే ముఖ్యం” అని మరొకరు రాసుకొచ్చారు. మార్కుల కంటే మనిషి ముఖ్యమని నిరూపించిన ఈ కుటుంబం, ఎంతో మంది తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచింది.