Loyal Stray Dog: కన్నీళ్లు పెట్టిస్తున్న వీధి కుక్క విశ్వాసం.. అన్నం పెట్టిన వ్యక్తి అంత్యక్రియల కోసం శ్మశానం వరకు శునకం!

Loyal Stray Dog

Loyal Stray Dog

Loyal Stray Dog: విశ్వాసం అంటే మొదట కుక్కనే గుర్తు చేసుకుంటారు.. ఆ శునకానికి ఉన్న విశ్వాసం కూడా వారికి లేదు అని తిట్టేస్తుంటారు.. మనుషుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలకు మించి మూగజీవులు చూపించే విశ్వాసం కొన్నిసార్లు అందరినీ కదిలిస్తుంది. మనకు ఆహారం పెట్టి, ఆదరించిన వారిని జంతువులు అంత సులభంగా మర్చిపోవు. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రతిరోజూ తనకు ఆహారం పెట్టే వ్యక్తి మరణించడంతో ఓ వీధి కుక్క ఆయన అంతిమయాత్రలో చివరి వరకు పాల్గొని తన విశ్వాసాన్ని చాటుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెహోర్ జిల్లాకు చెందిన 75 ఏళ్ల మోహన్‌లాల్ రైక్వార్ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. ఆయన తన పరిసర ప్రాంతాల్లో ఉండే కాళూ అనే వీధి కుక్కకు ప్రతిరోజూ ఆహారం పెట్టేవారు. అలా రోజూ తిండి పెట్టడం ద్వారా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. మోహన్‌లాల్‌పై కాళూ ప్రత్యేకమైన ప్రేమను పెంచుకుంది. అయితే గత వారం మోహన్‌లాల్ మరణించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు అంతిమయాత్ర ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న కాళూ కూడా వారితో పాటు బయలుదేరింది. అంత్యక్రియల ఊరేగింపు వెనుక నిశ్శబ్దంగా నడుచుకుంటూ శ్మశానవాటికకు చేరుకుంది. అక్కడ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు తనకు ఆహారం పెట్టిన వ్యక్తి పక్కనే ఓపికగా ఉండిపోయింది.

అంత్యక్రియల అనంతరం నిర్వహించిన సంతాప సభలోనూ కాళూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడికి వచ్చిన కాళూ.. సమావేశంలో పాల్గొన్న వారి ఎదురుగా నిశ్శబ్దంగా కూర్చుంది. మోహన్‌లాల్ జ్ఞాపకార్థం అక్కడున్నవారంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తున్న సమయంలో కాళూ కూడా అక్కడే ఉండిపోయింది. అనంతరం అంత్యక్రియల తర్వాతి సంప్రదాయంలో భాగంగా బంధువులు, కుటుంబ సభ్యులు మోహన్‌లాల్ ఇంటికి తిరిగి వెళ్లారు. వారి వెంట కాళూ కూడా వెళ్లింది. కొంతసేపు ఇంటి వద్దే ఉండి, తనకు ఆప్యాయత చూపించిన వ్యక్తికి చివరిసారిగా నివాళులర్పించినట్లుగా అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కాళూ విశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు.

యజమాని మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన మరో శునకం
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లోనే గత జూలైలో ఇలాంటి మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బేతుల్ జిల్లాకు చెందిన 67 ఏళ్ల ప్రదీప్ జైన్ భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా, 15 ఏళ్లుగా ఆయనతో కలిసి ఉంటున్న పెంపుడు కుక్క డగ్గు యజమాని మృతదేహాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరించింది. యజమాని మరణించాడని గుర్తించిన డగ్గు తీవ్ర ఆవేదనకు గురైంది. కుటుంబ సభ్యులు చివరిసారిగా యజమాని పక్కన కూర్చునేందుకు దానికి అవకాశం కల్పించారు. కొన్ని నిమిషాల పాటు మృతదేహం దగ్గరే నిశ్శబ్దంగా ఉండిపోయింది. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కాగానే డగ్గు కూడా శవపేటిక వెంట కొంతదూరం నడిచింది. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది. ఈ ఘటన చూస్తే.. ఆ యజమానితో ఆ కుక్కకు ఉన్న బాండింగ్‌ ఏంటో తెలిసిపోతుంది..