Site icon NTV Telugu

Krishnashtami: కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యమేంటి?

Krishnashtami

Krishnashtami

Krishnashtami: శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి పండగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇదో ధర్మసందేహంగా ఉంటుంది. సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు, పెరుగును దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ పాలు, పెరుగు ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్లు. అయితే కృష్ణుడు చాలా చిలిపిగా తన స్నేహితులను ఒంగోబెట్టి వాళ్లపైకి ఎక్కి ఉట్టిలోని పాలు, పెరుగును దొంగతనం చేసి తినేవాడు. ఆనాటి కృష్ణుడి గురించి పలువురికి చాటిచెప్పేందుకు, ముఖ్యంగా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలకొట్టి సంతోషిస్తుంటారు.

Read Also: Ola S1 E-Scooter: మార్కెట్‌లోకి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. ఫీచర్ల ఏంటి..? ధర ఎంతంటే..?

అయితే కాలం మారడంతో ఉట్టిలో పాలు, పెరుగు బదులు ఏవేవో వస్తువులతో పాటు రంగునీళ్లు, డబ్బులను వేస్తూ ఉట్టి కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తున్నారని వేదపండితులు మండిపడుతున్నారు. కృష్ణాష్టమి రోజు ఏర్పాటు చేసే ఉట్టిలో పాలు, పెరుగుతో పాటు పసుపు కొమ్ములను వేస్తే ఆరోగ్యానికి చాలా మంచి జరగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఉట్టిలోని రహస్యం ఇదేనని స్పష్టం చేస్తున్నారు. కాగా కృష్ణాష్టమి వేడుకల్లో అత్యంత ప్రధానమైంది ఉట్టి కొట్టే సంబరం .ఈ సంబరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు. ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు, పాలు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంబరం అందరిలోనూ ఆనందాన్ని నింపుతుందని పెద్దలు భావిస్తుంటారు.

Exit mobile version