మన భారతదేశంలోని కొన్ని చోట్ల అప్పుడప్పుడు విచిత్రమైన సంప్రదాయాలు వెలుగు చూస్తుంటాయి. ఆమధ్య ఓ అమ్మాయి వివాహం కుక్కతో జరిపించిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. శాపగ్రస్తురాలైన ఆ అమ్మాయి.. శాపం నుంచి విముక్తి పొందాలంటే, కుక్కని పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ గ్రామస్తులు ఆ వివాహం జరిపించారు. ఇలాంటి విపత్కరమైన పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ఊరిలో రెండు కుక్కల పెళ్లిని ఘనంగా నిర్వహించారు. హిందూ సంప్రదాయాల్ని అనుసరించే చేసిన ఈ పెళ్లికి 400 మంది హాజరుకావడం మరో షాకింగ్! ఆ వివరాల్లోకి వెళ్తే..
బీహార్‌లోని మోతిహారి మజురాహా గ్రామంలో కల్లు, బసతి అనే రెండు కుక్కలున్నాయి. వీరి యజమానులైన సాహ్ని, సబితా దేవిలు.. తమ కుక్కులకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. సాధారణంగా కాకుండా, అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు ఒక మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. బ్యాండ్ బాజా, డీజే ఏర్పాట్లు చేశారు. భారీ విందు ఏర్పాటు చేసి, గ్రామస్థుల్ని ఆహ్వానించారు. ఆ కుక్కల్ని వధూవరుల తరహాలోనే అలంకరించారు. కల్లు తలపై పాగా ధరించగా, బసతి ఎరుపు రంగు దుస్తులతో మెరిసిపోయింది. ముహూర్తం సమయం రాగానే, ఈ కుక్కలకు పురోహితుడు వివాహ కృతువు నిర్వహించాడు. ఈ వివాహ వేడుకకు మొత్తం 400 మంది హాజరు కాగా, చాలామంది డ్యాన్స్ చేస్తూ ఈ వేడుకని ఎంజాయ్ చేశారు.
అంతేకాదు.. తాము ఇలాంటి వివాహాన్ని మునుపెన్నడూ చూడలేదని అతిథులు తెలిపారు. వధూవరులకు బహుమతులు కూడా సమర్పించారు. అసలెందుకు ఇంత గ్రాండ్‌గా కుక్కల పెళ్లి నిర్వహించారని ఆరా తీస్తే.. మంచి ఫలితం కోసమేనని పురోహితుడు తెలిపాడు. కుక్కలు భైరవ స్వరూపులు కాబట్టి, ఇలా వివాహం జరిపిస్తే అంతా శుభమే జరుగుతుందని పేర్కొన్నాడు. బహుశా ఈ కుక్కల యజమానులు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నారేమో..! వాటి నుంచి విముక్తి పొందడం కోసమే ఇంత గ్రాండ్‌గా పెళ్లి నిర్వహించినట్టు తెలుస్తోంది.
