Class 4 Question Issue: ఛత్తీస్‌గఢ్‌లో నాలుగో తరగతి మధ్యంతర ఇంగ్లిష్ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా వివాదంగా మారింది. వ్యాకరణం లేదా పాఠ్యాంశాలపై కాకుండా, ఒకే ఒక్క మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ కారణంగా ఈ వివాదం చెలరేగింది. అయితే, రాయ్‌పూర్ డివిజన్‌కు చెందిన పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి 6వ తేదీన నిర్వహించిన పరీక్షలో, “మోనా కుక్క పేరు ఏమిటి?” అనే ప్రశ్నను అడిగారు. దీనికి బల, షేరు, రామ్, పైవాటిలో ఏదీ కాదు అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అయితే, పరీక్ష అనంతరం ప్రశ్నాపత్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కుక్క పేరుకు ‘రామ్’ అనే ఆప్షన్ ఇవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది మతపరమైన భావాలను దెబ్బతీసిందని ఆరోపించారు.
ఇక, ఈ ప్రశ్నాపత్రం బలోదాబజార్, భాటాపారా, మహాసముంద్, ధమ్తరి, గరియాబంద్ జిల్లాల్లో పంపిణీ అయింది. వివాదం చెలరేగిన తర్వాత విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో ప్రశ్నాపత్రం తయారీపై ఆరా తీస్తున్నారు. క్వశ్చన్ పేపర్ తయారీలో పాల్గొన్న ఉపాధ్యాయులు, మోడరేషన్ చేసిన సిబ్బంది నుంచి వివరణలు తీసుకుంటున్నారు. కాగా, విచారణలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్ టీచర్ శిఖా సోని ప్రశ్నాపత్రం రూపొందించినట్టు తేలింది. ఆమె ‘రాము’ అని టైప్ చేయాలనుకున్నప్పటికీ, టైపింగ్‌లో ‘యు’ అక్షరం పడకపోవడంతో ‘రామ్’గా ముద్రించడమైందని వివరణ ఇచ్చారు.
Read Also: CM Chandrababu: తెలంగాణ వదిలిన నీటిని వాడుకుంటే తప్పేంటి..?
అయితే, ఇది అనుకోకుండా జరిగిన పొరపాటేనని సదరు టీచర్ శిఖా సోని క్షమాపణ చెప్పారు. ప్రశ్నాపత్రం మోడరేషన్ చేసిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలు నమ్రత వర్మ కూడా పొరపాటును గమనించలేకపోయానని తెలిపారు. కాగా, ప్రాథమిక విచారణ తర్వాత ప్రశ్నాపత్రం రూపొందించిన హెడ్‌మిస్ట్రెస్‌ను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. మోడరేషన్ చేసిన ఉపాధ్యాయురాలిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. మరోవైపు, మహాసముంద్ జిల్లా విద్యాధికారి ప్రింటింగ్ లోపం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు.
