NTV Telugu Site icon

World Bank: ఏ దేశమైనా ఏమున్నది గర్వకారణం. ప్రతిదీ ఆర్థికమాంద్యం వైపు తిరోగమనం. వరల్డ్ బ్యాంక్ ఆందోళన

World Bank

World Bank

World Bank: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యానికి చేరువులో ఉందని సాక్షాత్తూ వరల్డ్ బ్యాంకే ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం, రుణాల భారం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు. 2023 ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను 3 శాతం నుంచి ఒకటీ పాయింట్ 9 శాతానికి తగ్గించుకున్నామంటేనే డేంజర్ జోన్‌లోకి వెళుతున్నామని, అదే.. ఆర్థికమాంద్యమని అన్నారు.
YouTube video player
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల సందర్భంగా ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలపై అప్పుల భారం పెరిగిపోతుండటాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ ప్రత్యేకంగా పట్టిచూపారు. ద్రవ్యోల్బణ సమస్య, వడ్డీ రేట్లు పెరగటం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మూలధన ప్రవాహం తగ్గటం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజలు సైతం ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్థికమాంద్యం కచ్చితంగా ఏర్పడుతుందని తెలిపారు.

ఇదిలా ఉండగా.. వరల్డ్ బ్యాంక్ సెప్టెంబర్ నెల మధ్యలో పబ్లిష్ చేసిన ఒక స్టడీ రిపోర్టును చైనా వార్తా సంస్థ జిన్హువా ప్రస్తావించింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు ఒకేసారి వడ్డీ రేట్లు పెంచుతాయని ప్రపంచ బ్యాంక్ ఆ రిపోర్టులో హెచ్చరించటాన్ని జిన్హువా గుర్తుచేసింది. వృద్ధి అంచనా కేవలం సున్నా పాయింట్ 5 శాతంగానే ఉంటుందని, దీనివల్ల ప్రపంచం క్రమంగా ఆర్థికమాంద్యంలోకి జారుకోవచ్చని వరల్డ్ బ్యాంక్ తన అధ్యయనంలో పేర్కొనటాన్ని జిన్హువా న్యూస్ రిపోర్ట్ చేసింది.

వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ వ్యాఖ్యల విషయానికొస్తే.. ప్రపంచ దేశాల జనాభా వృద్ధి ఏటా ఒకటీ పాయింట్ ఒకటి శాతంగా నమోదవుతోందని అంచనా వేశారు. జిన్హువా వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు డేవిడ్ మల్పాస్ సమాధానమిస్తూ ప్రపంచ వృద్ధి అంచనాలను ఇంకా తగ్గించుకుంటూ పోతున్నామంటే ప్రజలు మరింత వెనకడుగు వేస్తున్నారే అర్థమని కుండబద్ధలు కొట్టారు. 1990ల దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పేదరిక నిర్మూలన ప్రయత్నాలకు కొవిడ్-19 మహమ్మారితో పెద్ద గండి పడినట్లు ఇటీవలి ప్రపంచ బ్యాంక్ నివేదిక గుర్తించటాన్ని డేవిడ్ మల్పాస్ నిదర్శనంగా చూపారు.

కరోనా వల్ల 2020లో దాదాపు 70 మిలియన్ల మంది ప్రజలు పేదరికం నుంచి అత్యంత పేదరికంలోకి జారుకున్నారని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాళ్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయిలోకి పడ్డట్లయిందని చెప్పారు. పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ అనే పేరుతో విడుదల చేసిన వరల్డ్ బ్యాంక్ రిపోర్టు.. 2020లో ప్రపంచ మధ్యస్థ ఆదాయం 4 శాతం పడిపోయినట్లు పేర్కొంది. ప్రపంచ మధ్యస్థ ఆదాయ గణన 1990లో ప్రారంభం కాగా మధ్యస్థ ఆదాయం పడిపోవటం ఇదే తొలిసారి.

ఈ పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం వస్తే గ్లోబల్ మీడియన్ ఇన్ కం మరీ దిగజారుతుంది. ఫలితంగా.. మధ్యస్థ ఆదాయ స్థాయికి దిగువన ఉన్నవాళ్లు ఇంకా కిందికి పతనం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోని మెజారిటీ మూలధనం.. అభివృద్ధిలో అగ్ర భాగంలో ఉన్న అధునాధన ఆర్థిక వ్యవస్థల్లోనే కేంద్రీకృతమై ఉండటం సరికాదనే అభిప్రాయాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ వ్యక్తం చేశారు. ఈ మూలధనం కొత్త వ్యాపారాల్లోకి మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి ప్రవహించటమే పరిష్కారమని చెప్పారు. ప్రపంచ దేశాలు పరిష్కరించుకోవాల్సిన అంశాల్లో ఇది కూడా ఒకటని అన్నారు.

ఆధునిక ప్రభుత్వాలు ఈ దిశగా ఆర్థిక, ద్రవ్య విధానాలను మార్చుకుంటే సరిపోతుందని సూచించారు. ఆధునిక దేశాల నుంచి ఇతర దేశాలు కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్నాయని, ఈ వాతావరణం తీవ్ర ప్రభావాల్ని చూపుతోందని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తేల్చిచెప్పారు. ఇవే పరిస్థితులు, పోకడలు 2023లోను మరియు 2024లోనూ కొనసాగే అవకాశం ఉందని ఆందోళన వెలిబుచ్చారు.