Site icon NTV Telugu

యూపీలో కానిస్టేబుల్‌కే ఇంత పెద్ద ఇళ్లా?.. నెట్టింట లగ్జరీ బంగ్లా ఫోటోలు వైరల్!

Untitled Design (7)

Untitled Design (7)

అంతర్రాష్ట్ర కోడైన్‌ ఆధారిత దగ్గు సిరప్ స్మగ్లింగ్ సిండికేట్‌ను నడుపుతున్నారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నోలోని అతని నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో బయటకు వచ్చిన అతని భవనం దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఆస్తి ప్రస్తుతం కస్టడీలో ఉన్న యూపీ పోలీసు కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్‌కు చెందినదేనని అధికారులు స్పష్టం చేశారు. కోడైన్‌ ఆధారిత దగ్గు సిరప్‌ల అక్రమ రవాణా కేసులో అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు వెల్లడించారు. అలోక్ ప్రతాప్ సింగ్‌కు చెందిన ఈ విలాసవంతమైన భవనం లక్నోలోని అత్యంత ప్రీమియం నివాస ప్రాంతమైన సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సింగ్ నివాసాన్ని చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూపీ పోలీసు కానిస్టేబుల్‌కు నెలకు సుమారు రూ.40 వేల జీతం మాత్రమే ఉంటుందని, అలాంటి పరిస్థితిలో ఇంత విలాసవంతమైన ఇల్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. “పోలీస్ కానిస్టేబుల్‌కు ఇంత పెద్ద ఇల్లు ఎలా?” అని కొందరు వ్యాఖ్యానించగా, “ఈ ఇంటిని చూసిన తర్వాత అందరూ JEE కంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకే సిద్ధం కావాలి” అంటూ మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు.

ఇదిలా ఉండగా, గతంలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ డిసెంబర్ 8న ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే అతడు సమన్లకు స్పందించకపోవడంతో ఈడీ అధికారులు అతని నివాసంపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.

Exit mobile version