Uma Devi Chigurupati Exclusive Interview: ఉమా దేవి చిగురుపాటి.. విజయవంతమైన మహిళాపారిశ్రామికవేత్త. ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు సొంతం చేసుకున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా అనే సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు హ్యూమన్ రిసొర్సెస్ విభాగాలను ముందుండి సమర్థంగా నడిపిస్తున్నారు. నాగార్జునా యూనివర్సిటీ నుంచి సోయిల్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉమా దేవి చిగురుపాటి.. ఫార్మాస్యుటికల్స్ రంగంలో 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవాన్ని సంపాదించారు. కార్పొరేట్ స్థాయిలో వివిధ హోదాల్లో పలు విధులను తనదైన శైలిలో నిర్వర్తించారు.
ఉమా దేవి చిగురుపాటి.. ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చైర్‌పర్సన్‌గా సైతం చేశారు. తన హయాంలో అటు క్షేత్ర స్థాయిలోను.. ఇటు ఉన్నత స్థాయిలోను.. రెండు విధాలుగా మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మన దేశంలోని ప్రీమియర్ బొటిక్ వైన్ తయారీ కేంద్రాల్లో ఒకటైన KRSMA ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా కూడా ఉమా దేవి చిగురుపాటి ఉండటం విశేషం. వైన్ తయారీకి కావాల్సిన ముడి సరుకును పండించేందుకు కర్ణాటకలోని హంపి హిల్స్‌లో ద్రాక్షతోటకు బీజం వేసి పెంచి పోషించారు. అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని కార్యకలాపాలను ఆమే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఉమా దేవి చిగురుపాటి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆల్ ఇన్ ఒన్ వండర్‌ఫుల్ ఉమెన్.