Small Loans-Better Payments: ‘‘చిన్న కుటుంబం.. చింతల్లేని కుటుంబం..’’ అంటారు కదా. ఆ మాటను.. బ్యాంక్ లోన్లకు కూడా వర్తింపజేయొచ్చనిపిస్తోంది. ఎందుకంటే.. చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకున్నవాళ్లు చెల్లింపులను తూచా తప్పకుండా చేస్తున్నారు. ముద్ర అనే కేంద్ర ప్రభుత్వ పథకం కింద లోన్లు తీసుకున్న కస్టమర్లను దీనికి ఉదాహరణగా చూపొచ్చు. 2015లో ప్రారంభించిన ఈ స్కీమ్‌లో భాగంగా 3 రకాల రుణాలు మంజూరు చేస్తారు.
అందులో.. శిశు అనే కేటగిరీలో 50 వేల లోపు, కిషోర్ అనే సెగ్మెంట్‌లో 5 లక్షల లోపు, తరుణ్ అనే సెక్షన్‌లో 10 లక్షల లోపు లోను ఇస్తారు. ఈ మేరకు ఎలాంటి తనఖాలూ, హామీలూ తీసుకోరు. అందువల్ల వీటిని రిస్క్‌తో కూడిన రుణాలని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ వీటి రీపేమెంట్ రికార్డు మెచ్చుకోవిధంగా ఉండటం విశేషం. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్‌లకు ఉద్దేశించిన ఈ రుణాల్లో బ్యాడ్ లోన్ల పర్సంటేజీ కేవలం 3.38 శాతం మాత్రమేనని తేలింది.
శిశు విభాగం కింద ఇచ్చిన లోన్లలో మొండి బకాయిల శాతం మరీ తక్కువగా అంటే 2.25 శాతానికే పరిమితం కావటం గమనించాల్సిన విషయం. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఈ గణాంకాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు మన దేశంలోని బ్యాంకింగ్ రంగంలో 5 పాయింట్ తొమ్మిదీ ఏడు శాతం ఎన్‌పీఏలు ఉండగా అందులో ముద్ర రుణాల వాటా సగం కన్నా తక్కువేనని డేటా చెబుతోంది. ముద్ర పథకాన్ని అధికారికంగా ‘‘ప్రధాన్ మంత్రి ముద్ర యోజన’’గా పేర్కొంటారు.
దీని కింద ప్రభుత్వ, ప్రైవేట్, ఫారన్ అండ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంకులతోపాటు రీజనల్ రూరల్ మరియు స్మాల్ ఫైనాన్స్ స్కీమ్స్ ద్వారా లోన్లు ఇస్తారు. ముద్ర రుణాల్లో 46 శాతం ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చినవే. అయినా కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఎన్‌పీఏల్లో వీటి షేరు 4.98 శాతం మాత్రమే. ప్రభుత్వ బ్యాంకుల కన్నా ప్రైవేట్ బ్యాంకులే ఎక్కువ ముద్ర లోన్లు ఇచ్చినప్పటికీ ప్రైవేట్ బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో వీటి వాటా అత్యంత స్వల్పంగా 1.32 శాతానికి పరిమితమైంది.