NTV Telugu Site icon

IT Stocks Fallen: 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఈ రేంజ్‌లో పడిపోవటం ఇదే తొలిసారి

It Stocks Fallen

It Stocks Fallen

IT Stocks Fallen: అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. దీంతో ఆ ప్రభావం ఇండియన్‌ టెక్నాలజీ కంపెనీల పైన పడుతోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. మరీ ముఖ్యంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ గతేడాది కన్నా ఈసారి 24 శాతం డౌనైంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం ఇలా జరగటం ఇదే తొలిసారి.

వరుసగా ఐదేళ్లు లాభాలు ఆర్జించిన ఐటీ స్టాక్స్‌ ఈ సంవత్సరం నష్టాల్లోకి జారుకోవటం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. విప్రో, టెక్‌ మహింద్రా, ఎంఫసిస్‌ సంస్థల మార్కెట్‌ వ్యాల్యూ 40 శాతానికి పైగా పడిపోయింది. స్టార్టప్‌లే కాదు.. పెద్ద కంపెనీలు సైతం వందల సంఖ్యలో ఉద్యోగులకు లేఫ్‌లు ప్రకటించాయి. వెంచర్‌ క్యాపిటలిస్టుల పెట్టుబడులు తగ్గిపోయాయి.

India Growth: ఇండియా వృద్ధిపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ కామెంట్స్‌

ఇండియన్‌ ఎకానమీ అంతర్జాతీయ పరిస్థితులను తట్టుకొని నిలబడగలుగుతున్నప్పటికీ టెక్‌ ఇండస్ట్రీ మాత్రం వచ్చే ఏడాది కూడా ఒడిదుడుకులకు లోను కానుంది. మాంద్యం భయాలు మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెరుగుతున్న బ్యాంకుల వడ్డీ రేట్లు గ్లోబల్‌ ఐటీ సంస్థల ఆదాయాలను, అమ్మకాలను, గ్రోత్‌ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా.. ఇంటర్నేషనల్‌ క్లయింట్ల మీదే మేజర్‌గా ఆధారపడ్డ ఇండియన్‌ ఐటీ కంపెనీల రెవెన్యూ పరోక్షంగా ప్రభావితమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇండియాలో 3వ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వచ్చే ఏడాది ఆదాయ అంచనాలను కుదించుకుంది. టెలికం కంపెనీలు సైతం ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. నవ తరం స్టార్టప్‌లకూ ఈ సెగ తగులుతోంది. స్నాప్‌డీల్‌, ఫార్మ్‌ఈజీ, మొబీక్విక్‌, డ్రూమ్‌ వంటి కంపెనీలు లిస్టింగ్‌ ప్లాన్లను పక్కన పెట్టాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగటంతోపాటు లేబర్‌ మార్కెట్ బలహీనపడటం ఇండియన్‌ ఐటీ కంపెనీల అవకాశాలకు ప్రతికూలంగా మారనుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.