IT Minister KTR Highlight Speech: ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మనందరికీ తెలుసు. కానీ.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. దీనికి కొత్త అర్థం చెప్పారు. ఐ అంటే ఇండియా అని, టీ అంటే తైవాన్ అని పేర్కొనటం ద్వారా అందర్నీ ఆకట్టుకున్నారు. నిన్న గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘టీ-వర్క్స్’ ప్రారంభోత్సవంలో ఆయన ఈ సరికొత్త నిర్వచనం ఇచ్చారు.
తైవాన్ కేంద్రంగా పనిచేసే ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇండియా-తైవాన్ మధ్య సంబంధాలు అద్భుతంగా అభివృద్ధి చెందనున్నాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఈ కార్యక్రమంలో రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. ఇండియాలో అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్‌గా టీ-వర్క్స్ కార్యరూపం దాల్చటానికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
read more: Indian Companies Q3 Earnings: విశ్లేషకులు చెప్పినదానికన్నా మంచి ఫలితాలు
టీ-వర్క్స్ కుటుంబ సభ్యులందరూ గొప్పగా పనిచేశారని మెచ్చుకున్నారు. సాఫ్ట్‌వేర్‌కి ఇండియా పవర్‌హౌజ్‌లా మారిందని చెప్పారు. ఇక.. హార్డ్‌వేర్ విషయానికొస్తే.. తైవాన్.. ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిందని, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారుచేసిందిని ప్రశంసించారు. భారతదేశం కూడా ఈ స్థాయిలో ప్రొడక్టులను రూపొందించటంలో తైవాన్ మార్గదర్శకత్వం కావాలని కోరారు.
ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కావటం పట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వెలిబుచ్చారు. తెలంగాణ.. యంగ్ స్టేట్ అని, రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నరేళ్లు మాత్రమే అయిందని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిపిన ఉద్యమంలో ‘నియామకాలు’ అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటామని గుర్తుచేసుకున్నారు. ఆ నినాదం మరింత వాస్తవ రూపం దాల్చటంలో ఫాక్స్‌కాన్ తన వంతు పాత్ర పోషించనుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ కంపెనీ రాక.. తెలంగాణ యువతలో సంతోషం నింపుతుందన్నారు. ఫాక్స్‌కాన్ ప్రతినిధులు ఇండియాలో చూసిన బెస్ట్ సిటీల్లో హైదరాబాద్ ఒకటని తెలిపారు. ఈ సంస్థతో దీర్ఘకాలం ప్రయాణం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతిచిన్న దేశమైన తైవాన్ ఎంతో పురోగతి సాధించిందని, అందులో ఫాక్స్‌కాన్ కూడా తన వంతు పాటుపడిందని కొనియాడారు.
ఫార్చ్యూన్-500 కంపెనీల్లో టాప్-20లో చోటు సంపాదించిందని కితాబిచ్చారు. చైనాతోపాటు పలు దేశాల్లో లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ప్రశంసలు కురిపించారు. షెంజెన్ నగరం చైనాలో అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని, హైదరాబాద్‌ను కూడా షెంజెన్ ఆఫ్ ఇండియాలా డెవలప్ చేయాలని ఫాక్స్‌కాన్ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు.