NTV Telugu Site icon

హుజురాబాద్ ఆటలో ‘అరటిపండు’ ఎవరు?

అన్ని అనుకూలిస్తే ఆ నేత హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేవాడు. కానీ అతడి వ్యూహం బెడిసి కొట్టడంతో ఆ సీటు చివరి నిమిషంలో దూరమైంది. దీంతో ఆ నేతకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు సదరు నేతకు శాసన మండలిలో అడుగు పెడుతారని అంతా భావించారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు నిరాశ తప్పలేదు. ఇప్పటికే ఆ నేత ఎవరో ఓ క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. ఆయనెవరో కాదో హుజురాబాద్ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ తరుపున పోటీ చేశాడు. యువనేతగా గుర్తింపు తెచ్చుకున్న కౌశిక్ రెడ్డి నాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు గట్టి పోటీ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టీఆర్ఎస్ లో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆపార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేశాడు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి బరిలో దిగుతాడని అంతా భావించారు. కానీ అనుహ్యంగా ఆయనకు టీఆర్ఎస్ టిక్కెట్ దూరమైంది.

కాంగ్రెస్ లో ఉంటూ టీఆర్ఎస్ టిక్కెట్ తనకే ఖాయమైందనే కౌశిక్ రెడ్డి ఫోన్ కాల్ సంభాషణ లీకైంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయన ఆశించినట్లుగా అతడికి హుజూరాబాద్ టిక్కెట్ దక్కలేదు. బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్ హుజురాబాద్ టిక్కెట్ దక్కింది. ఈక్రమంలోనే కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. ఈమేరకు గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు.

అన్ని అనుకూలిస్తే ఆయన ఎమ్మెల్సీ హోదాలో హుజూరాబాద్ లో జరిగే సభలు, సమావేశాలకు హాజరయ్యేవాడు. కానీ అతడి బ్యాడ్ లక్కేంటో తెలియదు కానీ గవర్నర్ మాత్రం ఆ ఫైల్ ను ఆమోదించకుండా హోల్డ్ లో పెట్టారు. సేవా కోటాలో కౌశిక్ రెడ్డి పేరును చేర్చడంపై గవర్నర్ తమిళ సై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని గవర్నర్ చెబుతున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవీ హుజూరాబాద్ ఎన్నికల ఫలితం వెలువడే దాకా వాయిదా పడే అవకాశం కన్పిస్తుంది. ఆ తర్వాతే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ లోని సీనియర్లను కాదని కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవీని ఆఫర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం హుజూరాబాద్లో ఎన్నికల హీట్ మొదలు కావడంతో అందరిదృష్టి ఈ ఎన్నికపైనే పడింది. ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా వార్ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి సైతం టీఆర్ఎస్ అభ్యర్థి తరుపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ చూస్తుంటే దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్లుగా తయారైంది. దీంతో తమ నేతకు కాలం ఎప్పుడు కలిసి వస్తుందోనని కౌశిక్ రెడ్డి అభిమానులు ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే అతడి భవిష్యత్ కు ఢోకా ఉండదని అర్థమవుతుంది. కానీ ఫలితం రివర్స్ అయితే కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏంటనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.