Cinema Theatres: సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మేరకు గత ఏడాది కాలంలో 150 శాతం వృద్ధి నెలకొందని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది. వచ్చే 2 నెలల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మూవీ కోసం సినిమా హాల్‌కు లేదా మల్టీప్లెక్స్‌కు వెళ్లటానికి ప్లాన్ చేస్తున్నారు. గడచిన 2 నెలల్లో.. అంటే.. 2022 నవంబర్, డిసెంబర్‌లలో.. 26 శాతం మంది సినిమా హాల్‌కి లేదా మల్టీప్లెక్స్‌కి వెళ్లినట్లు తెలిపారు.
read more: Blockbuster Vs Netflix: ఓటమి అంచుల నుంచి.. విజయ తీరాలకు. తెలుసుకోవాల్సిన ‘బ్లాక్‌బస్టర్’ స్టోరీ
సర్వేలో పాల్గొన్నవారిలో 17 శాతం మంది.. పిక్చర్ చూసేందుకు సినిమా హాల్‌కి లేదా మల్టీప్లెక్స్‌కి వెళ్లే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. లోకల్ సర్కిల్స్ సంస్థ 2020వ సంవత్సరం అక్టోబర్ నెల నుంచి.. ‘‘సిటిజన్ పల్స్ ఆన్ సినిమా హాల్స్’’ అనే పేరుతో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. కనీసం ఒక్కసారి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు థియేటర్‌కి వెళ్లాలని భావించేవారి సంఖ్య 2021 డిసెంబర్ నుంచి క్రమంగా పెరుగుతున్నట్లు లోకల్ సర్కిల్స్ గుర్తించింది.
ఒకటికన్నా ఎక్కువ సార్లు థియేటర్‌కి వెళ్లాలని అనుకున్నవారి సంఖ్య 2021 డిసెంబర్‌లో 2 శాతంగా మాత్రమే నమోదు కాగా అదిప్పుడు 6 శాతానికి పెరిగింది. ఒక్కసారి మాత్రమే థియేటర్‌కి వెళ్లాలనుకున్నవారి సంఖ్య 2021 డిసెంబర్‌లో 12 శాతం కాగా 2023 జనవరిలో ఏకంగా 28 శాతానికి చేరింది. సినిమా అంటే OTT ప్లాట్‌ఫామే అని అనుకుంటున్న తరుణంలో మూవీ కోసం థియేటర్లకు వెళ్లాలని భావిస్తున్నవారి సంఖ్య ఈ స్థాయిలో పెరగటం ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీకి శుభసూచకమని లోకల్ సర్కిల్స్ పేర్కొంది.