NTV Telugu Site icon

Omicron XE: ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్లపై ఫోకస్‌ పెట్టిన డబ్ల్యూహెచ్‌వో..

Who

Who

తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్‌ వేరియంట్ మ్యుటేట్ అవుతోంది. కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉత్పరివర్తనం చెందుతూ అనేక కొత్త వేరియంట్ల సృష్టికి కారణమవుతోంది. అందులో భాగంగానే ఏర్పడిన బీఏ.2 అనే ఉపరకం 95 శాతానికిపైగా ప్యూరిటీ ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే తాజాగా మరో రెండు కొత్త వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 సౌతాఫ్రికాలో బయటపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సిస్టర్ వేరియంట్స్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. బీఏ.4, బీఏ.5లలో ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సంభావ్యతను అర్థం చేసుకునేందుకు అధ్యయనం కొనసాగుతోందని వివరించింది.

Read Also: Congress: నేడు రాజ్‌భవన్‌కు కాంగ్రెస్‌ బృందం.. గవర్నర్‌కు ఫిర్యాదు

బీఏ.2 మాదిరిగానే బీఏ.4, బీఏ.5 స్పైక్‌ ప్రొఫైల్‌ కలిగి ఉన్నాయి. వీటిలోని ఒక స్పైక్‌ ప్రొటీన్‌ డెల్టా, కప్పా, ఎప్సిలాన్‌ వేరియంట్లలోనూ ఉందని సైంటిస్టులు తెలిపారు. ఇప్పటికే బోట్స్‌వానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌, బ్రిటన్‌లలో కొత్త వేరియంట్స్‌ కేసులు బయటపడ్డాయి. సౌతాఫ్రికాలో ఈ సిస్టర్ వేరియంట్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌ నిర్ధారణ అయిన బాధితులందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నవారే… వారిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అయితే హాస్పిటలైజేషన్, మరణాలు లేనందున… ఆందోళన అవసరంలేదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు భారత్‌లోనూ కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూసినట్టు వార్తలు వస్తుండడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఎక్స్‌ఈ వేరియంట్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రివ్యూ చేశారు. వైరస్ వ్యాప్తి, కేసులపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.