NTV Telugu Site icon

చిన్నపాటి తప్పిదాలు TTD కొంప ముంచాయా?

Ttd

Ttd

చిన్నపాటి తప్పిదాలు TTD కొంప ముంచాయా? అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులపాలిట శాపమైందా? అందివచ్చిన అవకాశాన్ని TTD చేజేతులా జారవిడుచుకుందా? సర్వదర్శనం భక్తులకు మళ్లీ ఇక్కట్లు తప్పవా?

టీటీడీ వైఫల్యం.. భక్తులకు చుక్కలు
తిరుమల తిరుపతి దేవస్థానం అతిపెద్ద హిందు ధార్మిక సంస్థ. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. సాధారణ భక్తుడికి కూడా VIP భక్తుల తరహాలోనే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. కానీ.. కొన్ని విషయాల్లో TTD వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా సర్వదర్శన టోకెన్లు పొందే సమయంలో తలెత్తిన ఘటనలు భక్తులకు చుక్కలు చూపించాయి. కోవిడ్ పూర్వం కూడా టీటీడీ శ్లాటెడ్‌ విధానం అమలు చేసింది. నిత్యం 18 వేల నుంచి 20 వేల మందికి ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసేది. స్లాటెడ్ సర్వదర్శనం భక్తులకు మరో 20 వేల టోకెన్లు ఇచ్చేవారు. వీరికి ఉదయం నుంచి రాత్రి వరకు దర్శన సమయాలు కేటాయించి.. మిగిలిన సమయంలో టోకెన్లు లేకుండా వచ్చేవాళ్లను అనుమతించేవారు. దీంతో టోకెన్‌ పొందిన భక్తుడికి రెండుగంటల్లో దర్శనం అయితే.. టోకెన్‌ లేనివాళ్లకు 10 నుంచి 20 గంటలకుపైగా సమయం పట్టేది.

స్లాటెడ్‌ విధానంతో రిలాక్స్‌ అయిన టీటీడీ
కోవిడ్ కారణంగా దర్శన విధానంలో మార్పులు చేసింది టీటీడీ. భౌతికదూరం పాటించేలా.. కంపార్టుమెంట్లలో వేచి ఉండకుండా నేరుగా దర్శనానికి వెళ్లేలా జాగ్రత్త తీసుకుంది. అందరికీ స్లాటెడ్‌ దర్శనాలు అమలులోకి తెచ్చింది టీటీడీ. 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులతోపాటు సర్వదర్శన భక్తులను అనుమతించారు. రోజూ 25 వేల నుంచి 30 వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. 30 వేల నుంచి 40 వేల మంది సర్వదర్శన భక్తులకు తిరుపతిలో ఆఫ్‌లైన్ విధానంలో టోకెన్లు ఇచ్చారు. ఈ విధానంలో రోజూ 60 వేల నుంచి 70 వేలమంది స్వామి వారిని దర్శించుకోవడంతో.. ఇదే తమకు పదివేలన్నట్టుగా రిలాక్స్‌ అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం.

అంచనాలు లేకపోవడంతో తోపులాట
భక్తుల తాకిడికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం గాలికి వదిలేసింది. ఈ నెల 12 వరకు టోకెన్లు జారీ చేసే ప్రక్రియ 9నే ముగియడంతో తర్వాత ఆపేసింది. ఈ నిర్ణయమే TTD పుట్టి ముంచింది. TTD ఒకటి తలిస్తే.. జరిగింది మరొకటి. మూడు రోజుల తర్వాత భక్తులకు దర్శనం టోకెన్లు ఇస్తే ఇబ్బంది పడతారని భావించింది దేవస్థానం. కానీ తిరిగి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. రెండు రోజులుగా టోకెన్ల జారీని ఆపేయడంతో వేల మంది భక్తులు తిరుపతిలోనే ఉండిపోయారు. వాళ్లంతా టోకెన్లు ఎప్పుడు ఇస్తారా.. ఎప్పుడు స్వామిని దర్శించుకుందామా అని ఎదురు చూశారు. దాదాపు లక్ష టోకెన్లు జారీ చేసేందుకు సిద్ధమైనా.. 20 మంది భక్తులే క్యూలో వేచి ఉన్నా.. వారికి సరైన సౌకర్యాలు కల్పించలేదు. తోపులాటతో పరిస్థితి అదుపు తప్పింది.

కౌంటర్లపై ఒత్తిడి తగ్గే ప్రణాళికలు లేవా?
రోజూ 70 వేల నుంచి 80 వేల మందికి టోకెన్లు ఇస్తున్నా.. వారిలో పదివేల మంది వరకు దర్శనానికి రావడం లేదు. ఆ పదివేలు ఆఫ్‌లైన్‌లో కొత్త భక్తులకు కేటాయించే వెసులు బాటు ఉన్నా.. చర్యలు నిల్‌. కౌంటర్లపై ఒత్తిడి తగ్గేలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పైగా రద్దీ సమయంలో రెండేసి రోజులపాటు వేచి ఉండలేని భక్తులు.. కొండకు వచ్చి తలనీలాలు సమర్పించి.. అఖిలాండం దగ్గర కొబ్బరికాయలు కొట్టి తిరుగు ప్రయాణం అయ్యేవారు. దానినీ టీటీడీ అంచనా వేయలేకపోయింది. దీంతో కౌంటర్ల దగ్గర ఒత్తిడి పెరిగి కొత్త సమస్యలు తీసుకొచ్చింది. ఫలితంగా భక్తులకు సౌకర్యవంతంగా ఉండే స్లాటెడ్‌ విధానాన్ని రద్దుచేసి.. తిరిగి పూర్వపు విధానంలో భక్తులను దర్శనానికి అనుమతించాల్సి పరిస్థితి ఏర్పడింది.