ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి కుదించారు. తెలంగాణాలో రాత్రి కర్ఫ్యూ ఉన్న కారణంగా సెకండ్ షోస్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. దాంతో తెలంగాణలో థియేటర్లను ఈ నెలాఖరు వరకూ మూసేయాలనే నిర్ణయం వాటి యాజమాన్యం స్వచ్ఛందంగా తీసుకుందని, అయితే ‘వకీల్ సాబ్’ మాత్రం రెండు రోజులు ప్రదర్శిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ నిర్ణయంతో కొందరు థియేటర్ల యజమానులు విభేదించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… రాబోయే శుక్రవారం విడుదల కావాల్సిన ‘తలైవి, ఇష్క్, తెలంగాణ దేవుడు’ చిత్రాలు వాయిదా పడినా… ఓ నాలుగు చిత్రాల నిర్మాతలు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు. ‘శుక్ర, కథానిక, రావే నా చెలియా, మా వూరి ప్రేమకథ’ చిత్రాలను ఈ శుక్రవారం బరాబర్ రిలీజ్ చేస్తామంటూ సదరు నిర్మాతలు థియేటర్ల పట్టికతో సహా ప్రకటన ఇచ్చారు. సినిమా హాల్స్ ను మూసేస్తే తప్పితే ఇవి విడుదల కాకుండా ఆగవు… మరి శుక్రవారం తర్వాత కూడా ‘వకీల్ సాబ్’ను ప్రదర్శిస్తారా? కొత్త సినిమాలను విడుదల చేయనిస్తారా? అనేది వేచి చూడాలి.
తగ్గేదేలే అంటున్న ఆ నిర్మాతలు!
