తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ మహామహులకు కేంద్రం. అందులో ఎవరు.. ఎప్పుడు.. ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. తమకు అనుకూలంగా రాజకీయపరమైన పరిణామాలు ఎలా క్రియేట్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా.. ఈ టాపిక్ కు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణం అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తీవ్రంగా వ్యతిరేకించి.. భంగపడి.. చివరికి పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసి.. ఇప్పటి వరకూ రేవంత్ కు సహాయ నిరాకరణ చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి.. తాజాగా చేసిన చర్యతో.. మరోసారి తనలోని ఫైర్ బ్రాండ్ ను బయటపెట్టారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి.. కోమటిరెడ్డి హాజరయ్యారు. భేటీకి పార్టీ నేతలు ఎవరూ హాజరుకావద్దని స్వయానా.. కాంగ్రెస్ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా.. ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. సరికదా.. పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత వైఎస్ అనీ.. అలాంటి నాయకుడి పేరిట ఏర్పాటు చేసిన సమ్మేళనం విషయంలో పీసీసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మరోవైపు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పార్టీ సమావేశాలకు, సభలకూ దూరంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి సభకు రాలేనని చెప్పి కొన్నాళ్ల క్రితం.. తన ఆలోచనలను స్పష్టంగా బయటపెట్టారు. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని మరోసారి వినియోగించుకున్నారు. కచ్చితంగా వెళ్తానని చెప్పి మరీ.. వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి.. దివంగత సీఎంపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
పనిలో పనిగా.. రేవంత్ రెడ్డిపై తన ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా బయటపెట్టారని పార్టీ నేతలంతా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుంది.. ఎప్పటిలానే కోమటిరెడ్డిని లైట్ తీసుకుంటుందా? లేదంటే షోకాజ్ నోటీసు జారీ చేస్తుందా? అసలు ఆయన భవిష్యత్తును కాంగ్రెస్ ఎలా నిర్ణయిస్తుంది? కాంగ్రెస్ నాయకత్వం ఏమైనా ఆదేశాలిస్తే.. ఆయన ఎలా స్పందిస్తారు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇదే సమయంలో.. రాజకీయ విశ్లేషకుల మాటెలా ఉన్నా.. సామాన్యులు మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ.. అలాగే ఉంటుంది.. అంతా తన్నుకుంటారు.. మళ్లీ కలిసిపోయినట్టుగా వేదికలపై కూర్చుంటారు.. మనం చూస్తూ ఉండాలి.. అదంతే.. అని నిట్టూరుస్తున్నారు.