నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార సభలో సీఎం కేసీఆర్ కేవలం కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. బీజేపీని కౌంటర్ చేయలేదు. YS షర్మిల విమర్శలకు బదులివ్వలేదు. ఆ ఇద్దరినీ కేసీఆర్ ఎందుకు వదిలేశారు? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
కేసీఆర్ సభలో జానారెడ్డిపైనే విమర్శలు!
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. నాగార్జునసాగర్‌లో జరుగుతున్న ఉపఎన్నికే దీనికి కారణం. ఈ బైఎలక్షన్‌కు ముందు రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, నేతల విమర్శలు మరింత ఆజ్యం పోశాయి. ప్రచారం గడువు ముగియడానికి ఒక్కరోజు ముందు గులాబీ బాస్ కేసీఆర్ బహిరంగ సభ పెట్టడంతో చాలా విమర్శలకు ఆయన నుంచి కౌంటర్లు వస్తాయని అనుకున్నారు. కానీ.. అందరి అంచనాలను కాదని.. సభలో కేవలం కాంగ్రెస్ పార్టీని, జానారెడ్డిని కార్నర్ చేశారు. చివరకు వరకు అదే ఒరవడి కొనసాగింది.
సాగర్‌లో బీజేపీని ప్రత్యర్థిగా భావించలేదా?
కాంగ్రెస్‌తోపాటు బీజేపీని కూడా తనదైన శైలిలో కేసీఆర్ మాటలతో ఆడుకుంటారని అంతా అనుకున్నారు. అలాగే కొత్తగా వస్తున్న YS షర్మిల పార్టీ గురించి కామెంట్ చేస్తారని భావించారు విశ్లేషకులు. కానీ.. బీజేపీ, షర్మిల పార్టీల గురించి ఒక్క మాట మాట్లాడలేదు గులాబీ దళపతి. గతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీని సీఎం కేసీఆర్ టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సభలో మాత్రం బీజేపీ ఊసే లేదు. సాగర్‌లో బీజేపీని ప్రత్యర్థిగా టీఆర్‌ఎస్ భావించడం లేదట. అందుకే జానారెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు టీఆర్‌ఎస్ వర్గాల వాదన. బీజేపీ గురించి మాట్లాడి ఆ పార్టీకి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచించినట్టు తెలుస్తోంది.
ఎన్నికల సభలో షర్మిల విమర్శలకు కౌంటర్లు లేవు!
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నాని ప్రకటించారు వైయస్ షర్మిల. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సాగర్ సభలో ఆ విమర్శలపై కేసీఆర్ రియాక్ట్ అవుతారని అనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిలపై మాట్లాడం అవసరం లేదని టీఆర్‌ఎస్ భావించిందట. ప్రస్తుతం షర్మిల పార్టీ విషయంలో వేచి చూసే ధోరణిలో టీఆర్‌ఎస్ ఉంది. ఒకరిద్దరు టీఆర్ఎస్ నేతలు మాత్రమే రియాక్ట్ అయ్యారు. ఆమె గురించి మాట్లాడటానికి అది సరైన వేదిక కాదని భావించే సభలో కేసీఆర్ ఆ ప్రస్తావనే తీసుకురాలేదు.
మొత్తానికి ఎన్నికల సభలో ఆ ఇద్దరినీ కేసీఆర్ వదిలేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరికి వారుగా విశ్లేషణలు చేస్తున్నారు.