భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఇవాళ్టికి 72 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిషర్ల కబంధ హస్తాలనుంచి మనం బయటపడింది ఆగస్టు 15, 1947 .. కానీ మనల్ని మనం పాలించుకునేందుకు ఒక విధానం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది ఆ తర్వాతే.
దేశాన్ని ఒకే తాటిపై నడిపించేది రాజ్యాంగం. మన ప్రభుత్వాలు ఏం చేయాలన్నా, ఏం చేయకూడదో చెప్పాలన్నా మనం నిర్దేశించుకునేది రాజ్యాంగంలోని నిబంధనలనే. 1950 జనవరి 26న మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి, ఆ సంవత్సరం నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా, రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం.
బ్రిటిషన్ల నుంచి మనకు విముక్తి లభించాక రాజ్యాంగ రచన చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో 15 మంది మహిళలతోపాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. బీఎన్ రావు రాజ్యాంగ సలహాదారుగా నియమితులు కాగా.. ఈ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మొత్తం 299 సభ్యులుండగా తుది ప్రతిమీద 284 మంది సంతకం చేశారు. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సారధిగా కమిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భారతదేశానికి ఉత్తమమయిన రాజ్యాంగాన్ని రూపొందించడంలో అవిశ్రాంతం పనిచేశారు. కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది.
1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 26, 1950 నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘పూర్ణ స్వరాజ్య దినం’ లేదా ‘స్వాతంత్య్ర దినోత్సవం’గా 1930 జనవరి 16న ప్రకటించడమే దీనికి కారణం. 1929లో లాహోర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం నాటికి మొత్తం 562 స్వదేశీ సంస్థానాలు ఉండగా.. ఎనిమిది మినహా మిగతావి భారతదేశంలో విలీనమయ్యాయి. మిగిలిన ఎనిమిది 1956లో రాష్ట్రాల పునర్నిర్మాణచట్టం ప్రకారం విలీనమై, మనదేశమంతా పార్లమెంటరీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ప్రాథమిక హక్కులే భారత ప్రజాస్వామ్యానికి నిజమైన పునాదిగా చెబుతారు.
రాజ్యాంగం ఏర్పాటుచేసుకున్నప్పుడు న్యాయవ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానంలో ఎనిమిది మంది న్యాయమూర్తులు ఉండేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం 33కు పెంచారు. దేశ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మదింపు చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని (కాగ్), ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్‌ను, న్యాయ సంబంధ విషయాలను చూడడానికి ఉన్నత న్యాయాధికారిని, అతనికి సహాయకునిగా మరొక అధికారికి రాజ్యాంగంలో స్థానం దక్కింది.
రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ప్రాథమిక హక్కులు 7 వుండేవి. సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14 – 18 ). స్వాతంత్య్రపు హక్కు ( 19 – 22 ),పీడనాన్ని నిరోధించే హక్కు ( 23 , 24 ),మత స్వాతంత్య్రపు హక్కు ( 25 – 28 ), విద్యా సాంస్కృతిక హక్కు ( 29 , 30 ).ఆస్తి హక్కు ( 31 ), రాజ్యాంగ పరిహారపు హక్కు ( 32 ). ప్రాథమిక హక్కులతో పాటు మనకు ఆదేశిక సూత్రాలు వున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా ఆదేశిక సూత్రాలను అమలు పరిచిన దేశం – స్పెయిన్ , కానీ భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్ నుండి స్వీకరించి 4 వ భాగంలో పొందుపరిచారు. ఆదేశ సూత్రాల గురించి వివరించే నిబంధనలు ఆర్టికల్ 36 – 51 వరకూ వున్నాయి. ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ ఉండదు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు.ప్రస్తుతం ప్రాథమిక విధులు 11.
ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పీఠికను చదవనున్నారు. అలాగే, రాజ్యాంగ సభ చర్చలు డిజిటల్ వెర్షన్‌లో విడుదల చేస్తారు. రాజ్యాంగానికి ఇప్పటి వరకూ జరిగిన సవరణలతో కూడిన కాలీగ్రాఫీ కాపీని అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రధాని మోదీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగే రెండు రోజుల రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయమూర్తులు, సొలిసిటర్ జనరల్ హాజరవుతారు. రాజ్యాంగం గుర్తించిన 23 భాషల్లోనూ రాజ్యాంగ పీఠిక అందుబాటులోకి రానుంది.