జూన్ లో న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ అనంతరం భారత జట్టు అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. దాదాపు నెలరోజుల పాటు భారత ఆటగాళ్లు ఖాళీగా ఉండనున్నారు. అయితే ఈ గ్యాప్‌లో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతంలో కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ పర్యటనలో భారత్.. ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌లో ఉండటంతో.. శ్రీలంక పర్యటనకు ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో కూడిన మరో జట్టును పంపించనున్నట్లు తెలుస్తుంది. టెస్ట్ చాంపియన్ ఫైనల్ కు వెళ్లిన ఆటగాళ్లు కాకుండా మిగిత ఆటగాళ్లను ఈ పర్యటనకు బీసీసీఐ పంపనున్నట్లు తెలుస్తుంది.