కోవిడ్ నివారణ పద్ధతులపై, వ్యాక్సినేషన్ పై మరింత అవగాహన పెంచడానికి జాతీయ సేవా పథకం, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్ లకు సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న సందర్భంలో, ప్రజలలో మంచి అవగాహన, చైతన్యం కలిగించడం అత్యంత ఆవశ్యకమని గవర్నర్ తెలిపారు. ప్రజలు సరైన విధంగా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెంసింగ్ పాటించడం, గుంపులుగా గుమికూడకుండా ఉండటం ఇలాంటివి కోవిడ్ నివారణ, నియంత్రణలో అత్యంత కీలకమని డాక్టర్ తమిళి సై స్పష్టం చేశారు. ప్రజా చైతన్యంతోనే కోవిడ్ లాంటి మహమ్మారిని నిరోధించగలమని, ప్రజల ప్రాణాలను కాపాడగలమని ఆమె అన్నారు.
ప్రతి విశ్వవిద్యాలయంలోని ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను ఈ దిశగా తగు జాగ్రత్తలతో వినియోగించుకోవాలని గవర్నర్ సూచించారు. మనము ఎన్ని వెంటిలేటర్లు తయారుచేసిన, ఎన్ని మంచి మందులు తయారుచేసిన, ఆక్సిజన్ సప్లై పెంచినప్పటికీ చైతన్యవంతమైన ప్రజలే సరైన ముందు జాగ్రత్తలతో కోవిడ్ నివారించ గలరని డాక్టర్ తమిళిసై వివరించారు. కోవిడ్ బారిన పడుతున్న వారిలో దాదాపు 40 శాతం మంది యువకులే ఉండడం బాధను కలిగిస్తుందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ లు తమ తమ యూనివర్సిటీలలోని విద్యార్థులతో, వాలంటీర్లతో సోషల్ మీడియా ద్వారా ఇతర పద్ధతుల ద్వారా మంచి చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాలని, వినూత్న పద్ధతులు అవలంబించేలా ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.
ప్రతి విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని , ఈ దిశగా అధికారులు అందరూ శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వచ్చే నెల ఒకటవ తారీఖు నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్న దృష్ట్యా అర్హులైన అందరు విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలి అని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు.