కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో టీవీ, మూవీ సినిమాల షూటింగులను రద్దు చేసింది గోవా ప్రభుత్వం. రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్ సీరియల్ షూటింగుల కోసం మంజూరు చేసిన అన్ని అనుమతులను ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఇఎస్జి) రద్దు చేసింది. ఇఎస్జి అనేది గోవా ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ. ఇఎస్జికి రాష్ట్రంలో కమర్షియల్ షూటింగులకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. ద్దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడం వల్ల ఆయా ప్రభుత్వాల నిబంధనల మేరకు షూటింగులు ఆపేయాల్సి వచ్చింది. దీంతో ముంబై, చెన్నైకి చెందిన పలువురు సినిమా, టీవీ సీరియల్ మేకర్స్ తమ షూటింగ్ స్పాట్ ను గోవాకు మార్చారు. అయితే కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు గోవాలో సినిమా, సీరియల్ షూటింగ్ కోసం మంజూరు చేసిన అన్ని అనుమతులు రద్దు చేయబడ్డాయి. ప్రస్తుతం గోవాలో చిత్రీకరిస్తున్న చిత్రాలు, టీవీ సీరియల్స్ సిబ్బంది కూడా తమ షెడ్యూల్ ను ఆపేయాలని కోరారు. గోవా ప్రభుత్వం తాజాగా ఒకే చోట ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశాన్ని నిషేధించే సిఆర్‌పిసి సెక్షన్ 144 విధించడంతోపాటు కఠినమైన నిబంధనలను అమలు చేసింది. ఈ కారణంగానే షూటింగులు రద్దు చేయాలనీ ఇఎస్జి కోరింది. మళ్ళీ కోవిడ్ -19 పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతే ఇఎస్జి తన నిర్ణయాన్ని రివ్యూ చేస్తుంది. కాగా అధికారిక సమాచారం ప్రకారం గోవాలో బుధవారం 3,496 కొత్త కోవిడ్ -19 కేసులు, 71 మరణాలు సంభవించాయి, దీంతో మొత్తం కరోనా బారిన పెద్దవారి సంఖ్య 1,04,398 కు, మరణాల సంఖ్య 1,443 కు చేరుకుంది.
షూటింగులకు పర్మిషన్ క్యాన్సిల్ చేసిన గోవా ప్రభుత్వం…!
